Take a fresh look at your lifestyle.

నేటితో పూర్తి ‘భరోసా’

  • ఇప్పటివరకు 67.01 లక్షల మందికి లబ్ది.
  • రైతుల ఖాతాల్లో రూ. 8284.66 కోట్లు జమ.
  • సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా.
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : వానాకాలం పంటకు సంబంధించి సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా నిధులు జమ ప్రక్రియ నేటితో ముగియనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు వివరించారు.ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 8284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపారు.ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న మిగతా భూములకు కూడా రైతు భరోసా నిధుల ప్రక్రియను రేపటి వరకు పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేసి, రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు.ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు రెండు ఎకరాల వరకు రూ. 2349.83 కోట్లు, రెండో రోజు 3 ఎకరాల వరకు రూ.3901.73 కోట్లు, మూడో రోజు 4 ఎకరాల వరకు రూ.5215.26 కోట్లు, నాలుగో రోజు 5 ఎకరాల వరకు రూ.6404.70 ఎకరాలు, ఐదో రోజు 7 ఎకరాల వరకు రూ.7310.59 కోట్లు, ఆరో రోజు తొమ్మిది ఎకరాల వరకు రూ.7770.83 కోట్లు, ఏడో రోజు 15 ఎకరాల వరకు రూ.8284.66 కోట్లు విడుదల చేశామన్నారు. తాజాగా సోమవారం రాష్ట్రంలో 15ఎకరాల లోపు సాగు భూములు ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకు గాను రూ. 513.83 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.ఇంత తక్కువ వ్యవధిలోనే రైతుభరోసా నిధుల జమ ప్రక్రియను పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నప్పటికీ రాజీ పడకుండా వానాకాలం రైతుభరోసా పథకాన్ని పూర్తిచేశామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆనందంలో మునిగిపోయారని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. కానీ ఇవేమి కనబడని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికైనా మా ప్రభుత్వం రైతులకు చేస్తున్న మంచిని గ్రహించి దురుద్దేశంతో చేసే విమర్శలు మానుకోవాలన్నారు. రైతులకు మేలు చేసే ఆలోచనలతో ముందుకురావాలని హితవు పలికారు. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులను పూర్తి చేసిన నేపథ్యంలో నేడు రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతుపండగ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.నేడు సాయంత్రం 6 గంటలకు రైతులను ఉద్ధేశించి సీఎం మాట్లాడుతారని తెలిపారు.సీఎంకి కృతజ్ఙతపూర్వకంగా ప్రజా ప్రతినిధులు రైతులతో కలిసి వారి వారి నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రైతుపండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.