Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్ జిల్లాలో సలేశ్వరం జాతర సందడి ఏప్రిల్ 1 నుంచి 3 వరకు ప్రత్యేక బస్సులు – భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం జాతరకు ఆర్టీసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగే ఈ జాతరకు భక్తుల రాకపోకలు సౌకర్యవంతంగా ఉండేందుకు నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్ 2న భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సుమారు 15,000 మంది భక్తులు జాతరకు హాజరవుతారని అంచనా వేస్తుండగా, గత సంవత్సరం సుమారు 12,000 మంది భక్తులు పాల్గొన్నట్లు వెల్లడించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి నల్లమల్ల అటవీ ప్రాంతంలోని గుహలో వెలసిన స్వయంభూ సలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అచ్చంపేట మండలం మన్ననూరు నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రానికి చేరుకునేందుకు భక్తులు ప్రత్యేక ఏర్పాట్లను వినియోగించుకోవాలని సూచించారు.

భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన కరపత్రాలను డిపో మేనేజర్ ఆకారపు యాదయ్య విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు జోగమ్మ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.