- రెవెన్యూ,హౌసింగ్. సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ముద్ర.తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి భూభారతి చట్టంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో గత నెల 14వ తేదీన భూభారతి చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అదేనెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఆయా మండలాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 2వ తేదీ నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.ఈ రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులకు నిర్ధేశిత గడువు పెట్టుకొని భూ భారతి చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
ప్రయోగాత్మకంగా నిర్వహించిన నాలుగు మండలాల్లో ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించడం జరిగిందని, ఈనెల 30 తేదీ నాటికి దాదాపు 60 శాతం భూసమస్యలను పరిష్కరిస్తామని భూభారతి చట్టానికి లోబడి పరిష్కరించవలసిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.పరిష్కరించలేనివాటికి ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు తెలియజేస్తామని తెలిపారు.ఎప్పటికీ పరిష్కారం కానివి ఉంటే అసలు పరిష్కార యోగ్యం లేనివి అక్రమమైనవి ఉంటే అవి పరిష్కారం కావు అని చెప్పడం జరుగుతుంది.భూ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలి అనేది భూ భారతి చట్టం లక్ష్యం క్షేత్ర స్థాయిలో అధికారులు సత్వరం స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రెండవ దశలో 28 మండలాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో కూడా ఈనెల చివరినాటికి వీలైనంతవరకూ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.సాదాబైనామాలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టులో స్టే వెకేట్ అయిన వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అయితే ఆన్ లైన్ లో ఉన్న దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి గత ఏడాదిన్నర కాలంగా రెవెన్యూ విభాగంలో చేపట్టిన సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. భూభారతి చట్టాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఈ చట్టం వల్ల తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయన్న సంతోషం వారిలో కనిపిస్తుందన్నారు.అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మొత్తం రెవెన్యూ సేవలు ప్రజలకు దూరమయ్యాయని అన్నారు.మొత్తం వ్యవస్ధను ప్రజలకు చేరువు చేసి వారికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.