మాయమాటలతో మరోసారి ప్రజలను మోసం చేసిన సి ఎం రేవంత్ రెడ్డి : బి ఆర్ ఎస్ బడ్జెట్లో బిసి,ఎస్సీ & మైనార్టీలకు తీవ్ర అన్యాయం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
సి ఎం రేవంత్ రెడ్డి మాయమాటలతో మరోసారి ప్రజలను మోసం చేశారని బడ్జెట్లో బిసి,ఎస్సీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బిసి, ఎస్సీ, మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పైన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బిసి, ఎస్సీ, మైనార్టీ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలకు కానీ బీసీ, ఎస్సీలకు కానీ ప్రత్యేక సబ్ ప్లాన్లు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి ఒక్క రూపాయి నిధులు ప్రత్యేకంగా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి రావడానికి మాత్రమే ఆరోజు అనేక తప్పుడు హామీలు చెప్పారని కులవృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించేవారని అన్నారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరం అని, గొర్రెల పెంపకం దారులకు, చేపల పెంపకం దారులకు 2 లక్షల రూపాయలు ఇస్తానని, దళిత బంధు ప్రతి ఒక్క దళితులకు 12 లక్షల రూపాయలు బీసీ బందు ప్రతి ఒక్కరికి ఇస్తానని రైతుబంధు సంవత్సరానికి మూడు పంటలకు ఇస్తానని, పెన్షన్ 4000 ఇస్తానని, మహిళలకు 2500, ప్రతి ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని ఈ విధంగా అనేక మాయమాటలు చెప్పి ఈరోజు బడ్జెట్లో ఏ ఒక్క పథకానికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వలేదన్నారు. రానున్న రోజులలో ప్రజల కోసం టిఆర్ఎస్ పార్టీ తరఫున అనేక పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మాజీ జెడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇట్టబోయిన గోపాల్, కౌన్సిలర్లు నాకోటి నగేష్, చీమల రాజు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు నర్సింగరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తాడూరి బిక్షపతి, ఇక్బాల్ చౌదరి, కాజం, అంజద్, సూరిపంగా సుభాష్, గుజ్జ పవన్, డొప్ప వెంకటేష్, బచ్చు వెంకటేష్, సైదులు, విక్రమ్ పాల్గొన్నారు.