Take a fresh look at your lifestyle.

జిల్లా వ్యాప్తంగా ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్ నమోదు సేవలు ప్రారంభం

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, వారి ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తెలిపారు.

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏదైనా ప్రమాదం లేదా నేరం జరిగిన వెంటనే డయల్ 100 లేదా 112కు కాల్ చేయడం ద్వారా, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారిని సంప్రదించడం ద్వారా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడికక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని తెలిపారు.

ఈ సేవల ప్రధాన లక్ష్యం బాధితులు స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో వారికి సులభంగా న్యాయం అందించడం. ముఖ్యంగా పోక్సో కేసులు, ఈవ్ టీజింగ్, గృహ హింస, దొంగతనాలు, యాక్సిడెంట్లు, బాల్య వివాహాలు, చైల్డ్ లేబర్, ఉద్యోగ స్థలంలో వేధింపులు వంటి కేసుల్లో మహిళా పోలీస్ అధికారులతో కలిసి బాధితుల ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

అలాగే, మూగ, చెవిటి, దివ్యాంగుల ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేక అధికారులను కూడా వెంట తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసింగ్ సేవలు మరింత సమర్థవంతంగా, బాధితులకు అనుకూలంగా అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.