ముద్ర పెబ్బేరు :
శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామ అనుసంధాన తండాలో భాగ్యమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా తండాకు వచ్చిన ఎమ్మెల్యే కు తండావాసులు డప్పు వాయిద్యాల మధ్యన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పూలవర్షం కురిపిస్తూ ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భాగ్యమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వారి దంపతులకు నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భాగ్యమ్మ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మాకు సొంత ఇల్లు లేదని, అడవి ప్రాంతంలో ఉండే మా ఇంట్లోకి పాములు తేళ్లు వస్తున్నాయని ఇల్లు మంజూరు చేయాలని గత ప్రభుత్వంలో పదేపదే మాకు ఇల్లు ఇప్పించండి అని మొరపెట్టుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని 5 లక్షల రూపాయలు రావడంతో తాము నూతన గృహాన్ని నిర్మించుకొని నేడు గృహప్రవేశం చేసుకుంటున్నామని భాగ్యమ్మ తెలిపింది. నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలకు హాజరవుతూ ఆ ఇంటి పెద్ద కొడుకుల దంపతులకు నూతన వస్త్రాలు అందిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కి భాగ్యమ్మ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామసులతో మాట్లాడారు .ఈ సందర్భంగా వారు తండా అభివృద్ధికి కావలసిన పలు అంశాలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా ఆయన సంవత్సరం లోపల మీ తండాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీరంగపురం మండల నాయకులు భీరం రాజశేఖర్ రెడ్డి, రాములు యాదవ్, వెంకటయ్య, రాజ గౌడ్, కురుమూర్తి, పరుశురాం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.