ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపుపై నెలకొన్న సందిగ్ధతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు స్టే ఇస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరలు పెంచుకోవాలంటే, సదరు చిత్రం విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో పెద్ద సినిమాల విడుదలకు, వాటి బడ్జెట్ రికవరీకి ఇబ్బందులు తలెత్తుతాయని చిత్ర పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన ఈ 90 రోజుల నిబంధనను సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ.. టికెట్ ధరల పెంపు విషయంలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న పాత విధానాన్నే పాటించాలని స్పష్టం చేసింది. తాజాగా రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ప్రభుత్వ అనుమతితో అప్పటికప్పుడు రేట్లు పెంచుకునే అవకాశం మళ్లీ లభించినట్లయింది.