పెట్టుబడి వ్యవస్థను ఎదిరించడానికి మార్క్సిజమే పరిష్కారం సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
ముద్ర ప్రతినిధి, మెదక్:
పెట్టుబడి దారి వ్యవస్థను ఎదిరించడానికి మార్క్సిజమే పరిష్కారమని సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. శనివారం మెదక్ లోని కేవల్ కిషన్ భవన్లో మార్క్స్ వర్ధంతి సభలో ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక దోపిడిని ఎదిరించే మార్గం కారల్ మార్క్స్ సిద్ధాంతంలోనే ఉన్నదని చుక్క రాములు అన్నారు. నాడు ప్రపంచ పెట్టుబడి దారి వ్యవస్థ ఆర్థిక సామాజిక దోపిడీ నుండి విముక్తి పోరాటాల రూపకల్పన చేసింది మార్క్స్ అన్నారు. మార్క్స్ సిద్ధాంతాల ఆధారంగా లెనిన్ ఆచరణ సిద్ధాంతం ఆధారంగా 1917లో ఏర్పడిన రష్యన్ సోషలిస్ట్ వ్యవస్థ కార్మిక వర్గానికి కనీస సౌకర్యాలు కల్పించిందని అన్నారు. నేడు అమెరికా సామ్రాజ్య వాద కాంక్షతో అనేక దేశాలపై యుద్ధాలు చేస్తుంటే, వాటి నివారణకు ప్రపంచం అంతా కమ్యూనిస్ట్ దేశం చైనా, ఒకప్పటి కమ్యూనిస్టు దేశం రష్యా వైపు చూస్తోందన్నారు. 2005లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తే పరిష్కారానికి మార్క్స్ పెట్టుబడి గ్రంథంలోనే పరిష్కారం దొరుకుతుందని ప్రపంచ ఆర్థిక వేత్తలు తొంగి చూశారని అన్నారు. 2020లో ప్రపంచాన్నీ కుదిపేసిన కరోనాలో పెట్టుబడిదారి దేశాలన్ని అతలాకుతలం ఐతే సోషలిస్టు దేశం భౌగోళికంగా ఆర్థికంగా చిన్న దేశం అయిన క్యూబా అనేక దేశాలకు సహాయం చేసిందన్నారు. అంతిమగా దోపిడీ వ్యవస్థను కూల్చే మార్గం కారల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతలోనే ఉన్నదని పేర్కొన్నారు. సి.పి.ఎం పార్టీ మార్క్స్ ఆశయాల కొనసాగిం పుకు కృషి చేస్తుందన్నారు. మార్చి నెలంతా ప్రజా సమస్యలపై అధ్యయనం పోరాటాలు నిర్వహించాలని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె.నరసమ్మ మాట్లాడుతూ మార్చి 17న మున్సిపల్ కార్యాలయాలు, తహశీల్దారు కార్యాలయాల ముందు, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని, ఈ దర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.ఆడివయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలమణి, ఏ.మల్లేశం, కే.మల్లేశం, బస్వరాజు, జిల్లా కమిటీ సభ్యులు డి.మల్లేశం, సంతోష్, అజయ్, పూర్ణ, కార్యకర్తలు యశోద, శౌకత్, కవిత, బాబు, నరేందర్, వెంకట్, ప్రవీణ్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.