ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన ARRIVE ALIVE కార్యక్రమంలో భాగంగా ‘ఐ క్యాంప్’ను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ ఐ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. లారీ, ఆటో తదితర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, అందులో డ్రైవర్ల కంటి చూపు సమస్యలు కూడా ఒక కారణంగా ఉండొచ్చని తెలిపారు. అందువల్ల డ్రైవర్లు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందని, వీటిలో ఎక్కువగా యువతే బలవుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడం, అతివేగం మరియు రాంగ్ రూట్‌లో ప్రయాణించకూడదని స్పష్టం చేశారు.
వాహనం నడిపేటప్పుడు జరిగిన ప్రమాదాలు కుటుంబాలకు తీరని నష్టం కలిగిస్తాయని, అందువల్ల జాగ్రత్తగా వాహనాలు నడిపితే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్ రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ ఉపేందర్ రావు, ఆర్ఐ జగన్, ఎస్సై గోవర్ధన్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ కళ్యాణ్, ప్రశాంత్, ఆర్టీఓ అధికారులు రమేష్ రెడ్డి తదితరులు, డ్రైవింగ్ విభాగంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.