Take a fresh look at your lifestyle.

8 వారాల్లో “అభయహస్తం” అమలు చేయాలి -రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఆలస్యానికి కారణమేంటో నివేదిక ఇవ్వండి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభయహస్తం పధకం కింద ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇళ్ల స్థలం, నెలకు సుమారు రూ.25వేల పెన్షన్, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎనిమిది వారాల్గోగా ఈ హామీని అమలు చేయాలని సూచించింది. హామీలు అమలు చేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందో వివరించాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. కొందరికి మాత్రమే ప్రయోజనాలు ఇచ్చినట్లయితే దాని ప్రమాణాలు ఏమిటో తెలియజేయాలని కూడా కోర్టు సూచించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపిస్తూ పలువురు ఉద్యమకారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు ఈ ఆదేశాలు తెలంగాణ ఉద్యమకారులకు పెద్ద ఊరట ఇచ్చాయి. ఇప్పటివరకు అమలు విషయంలో స్పష్టత లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, ఇప్పుడు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని స్పష్టమైన జీవో జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే 8 వారాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే చర్చ జరుగుతున్నది.

Leave A Reply

Your email address will not be published.