Take a fresh look at your lifestyle.

యుద్ధ ప్రాతిప‌దిక‌న‌ అభివృద్ది ప‌నులు పూర్తి చేయాలి-వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దిపై మంత్రి పొంగులేటి స‌మీక్ష‌

వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్దికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు
త్వ‌ర‌లో ఎంజిఎం హాస్పిట‌ల్ ప్రారంభం
అండ‌ర్ గ్రౌండ్ ప‌నుల‌కు శంకుస్దాప‌న‌

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర ప్రభుత్వం వ‌రంగ‌ల్ న‌గ‌ర స‌మ‌గ్రాభివృద్దికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్లడించారు. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా పని చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబర్ లో వ‌రంగ‌ల్ జిల్లా అభివృద్దిపై దేవాదాయ, అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖతో క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పొంగులేటి మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రానికి ధీటుగా వ‌రంగ‌ల్‌ను అభివృద్ది ప‌ర‌చాల‌న్న కృత నిశ్చ‌యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందకువెళ్తోందన్నారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల అమ‌లులో వేగం పెంచాల‌న్న ఆయన ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా అభివృద్ది ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు. హైద‌రాబాద్ త‌ర్వాత అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో చేప‌ట్టిన వివిధ ప్ర‌గ‌తి ప‌నులు వ‌చ్చే జూన్ 2 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు అధికారులు నిర్విరామంగా ప‌నిచేయాల‌ని సూచించారు. భ‌ద్ర‌కాళి ఆల‌య అభివృద్ది ప‌నులు, భ‌ధ్ర‌కాళి చెరువు డీ సిల్టేష‌న్ అంశాల‌కు సంబంధించి ఆల‌య మాడ‌వీధుల్లో కృష్ణ‌శిల‌తో నిర్మాణం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. భ‌ద్ర‌కాళి చెరువు హెడ్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద ఇన్ ఫాల్ అవుట్ ఫాల్ విష‌యంలో భూ సేక‌ర‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు. గత ప్ర‌భుత్వం ఆర్బాటంగా శంకుస్ధాప‌న చేసి గాలికి వ‌దిలేసిన వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేశామ‌ని చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి ఆ ఆస్పత్రిని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణ ప‌నులు, ఆసుప‌త్రి సామ‌గ్రి ఏర్పాటు, డాక్ట‌ర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామ‌కానికి స‌త్వ‌ర‌మే కార్యాచ‌ర‌ణ‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, అవుట‌ర్ రింగ్ రోడ్డుకు, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్ భూసేక‌ర‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో రూ. 5,257 కోట్లతో చేప‌ట్టే భూ గ‌ర్భ డ్రైనేజీ ప‌నులకు సంబంధించి వెంట‌నే టెండ‌ర్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి వ‌చ్చేనెల‌లో ప‌నుల‌ను ప్రారంభించేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు. రెండు పడక గదుల నిర్మాణాలకు ఈనెల 31లోగా ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేసి కేటాయించాల‌ని సూచించారు. 2బిహెచ్‌కే కాల‌నీల్లో క‌రెంట్, డ్రైనేజ్‌, తాగునీరు, రోడ్లు వంటి క‌నీస సౌక‌ర్యాల‌ను ఆనాటి ప్ర‌భుత్వం విస్మ‌రించింద‌ని త‌క్ష‌ణ‌మే ఆయా కాల‌నీల్లో క‌నీస వ‌స‌తుల ఏర్పాటు చేయాల‌ని ఇందుకు అవ‌స‌రమైన బ‌డ్జెట్ ప్ర‌త‌పాద‌న‌లు పంపిస్తే నిధుల మంజూరు చేస్తాన‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు క‌డియం శ్రీ‌హరి, రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి, నాగ‌రాజు, నాయిని రాజేంద‌ర్‌, శాస‌న‌మండ‌లి స‌భ్యులు బ‌స్వ‌రాజు సార‌య్య‌, వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండు సుధారాణి, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ క‌లెక్ట‌ర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.