- భూ భారతితో మెరుగైన సేవలు.
- రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి.
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, రైతుల భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం శెట్పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహనా సదస్సు (పైలట్ ప్రాజెక్ట్) కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్లు రైతులతో సమగ్ర చర్చలు జరిపిన తర్వాత ఈ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు.ప్రజల నుండి స్వీకరించిన సలహాలను కూడా ఈ చట్టంలో పరిగణనలోకి తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.ఈ చట్టం అమలుకు ముందుగా, నాలుగు ప్రాంతాల్లో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంచుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన చొరవతోనే లింగంపేట మండలం పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టుల ద్వారా భూ సమస్యలను పరిశీలించి, రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ లింగంపేట మండల ప్రాంతం భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్ట్ గ ఎంపిక చేసినందుకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీనివాస్ రెడ్డి కి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.ధరణి పోర్టల్ వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా నియోజకవర్గ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.భూభారతి చట్టం తేవడంతో రైతుల భూమి సమస్యలు తొలిగిపోతాయని ధీమా వ్యక్తం చేసారు. లింగంపేట మండలం భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక అయిన విషయం తనకు తెల్వగానే చాల సంతోషం అనిపించింది అని ఎమ్మెల్యే అన్నారు.ఎల్లారెడ్డి చరిత్రలో రెవెన్యూ మంత్రి రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు.అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎల్లారెడ్డి ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, శెట్పల్లి & చుట్టూ పక్కన ఉన్న గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.
