Take a fresh look at your lifestyle.

ధైర్యం నింపండి ఉత్తమ ఫలితాలకై శ్రమించండి సమగ్ర కార్యాచరణకు జిల్లా కలెక్టర్ పిలుపు

 

ముద్ర, మహదేవపూర్ :

10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధనపై విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభను విశ్లేషించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లీషు వంటి ప్రధాన సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు సాధిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతి పాఠశాలలో రోజువారీ పరీక్షలు, వారాంత మోడల్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షలు అంటే భయం కలగకుండా, ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా వ్రాసేలా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ధైర్యం నింపాలని సూచించారు.తల్లిదండ్రులతో సమన్వయం పెంచి విద్యార్థుల హాజరు, అభ్యసన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. జిల్లాను ఉత్తమ ఫలితాల సాధనలో ముందంజలో నిలిపేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.