ముద్ర,మల్కాజి గిరి:
భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆదివారం పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సుమారు లక్ష మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తుండటంతో రెండు వేలమంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు మల్కాజ్గిరి సిపి సునీత వెల్లడించారు. మల్కాజిగిరి డిసిపి కార్యాలయంలో సిపి మీడియాతో మాట్లాడుతూ
సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, రాకపోక మార్గాలు, వాహన పార్కింగ్ ప్రాంతాలన్నీ కట్టుదిట్టమైన నిఘాలో ఉండనున్నాయని. ప్రవేశం నిర్ణీత గేట్ల ద్వారానే అనుమతించబడుతుంది. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ కఠిన భద్రతా తనిఖీలు నిర్వహించనుండగా, నిషేధిత ప్రాంతాల్లో అనధికార ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేస్తారు.
సభా ప్రాంగణం, చేరుకునే రహదారులు, వాహన తనిఖీ కేంద్రాలు, పార్కింగ్ ప్రాంతాలన్నీ సీసీటీవీ నిఘాలోకి తీసుకువచ్చారు. అన్ని సీసీటీవీ ఫీడ్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు సంయుక్త కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఐటీ బృందాలు, ఫీల్డ్ సిబ్బంది తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండనున్నారు.
కార్యక్రమం పూర్తయ్యే వరకు బాంబు నిర్వీర్య దళాలు నిరంతర యాంటీ సాబోటేజ్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రవేశ ద్వారాల వద్ద ఆధునిక భద్రతా స్కానర్లు ఏర్పాటు చేసి పేలుడు పదార్థాలు, నిషేధిత వస్తువుల గుర్తింపుకు చర్యలు చేపట్టారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, స్నిఫర్ డాగ్ బృందాలు సభా ప్రాంగణం పార్కింగ్ ప్రాంతాల్లో మోహరించబడ్డాయి. ఎలక్ట్రానిక్ పరికరాల తనిఖీ కోసం ప్రత్యేక సాంకేతిక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
అక్రమ కార్యకలాపాలు, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగనుంది. ఏదైనా అనుమానాస్పద విషయం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, యాంటీ ఈవ్‌టీజింగ్ బృందాలు ప్రత్యేకంగా విధుల్లో ఉంటాయి.
సభలో ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, డ్రోన్లు, బ్యానర్లు, నీటి సీసాలు, బ్యాగులు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, బ్యాటరీలు, సువాసన ద్రవ్యాలు, హెల్మెట్లు, బయట ఆహార పదార్థాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. మైదానం లోపల విక్రేతలు, హాకర్లకు కూడా ప్రవేశం ఉండదు.
సభా ప్రాంగణం పరిసర ప్రధాన రహదారులైన బేగంపేట–సికింద్రాబాద్, పారడైజ్–పట్నీ మార్గాలతో పాటు సమీప రహదారులపై వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించారు. వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపివేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రవేశ ద్వారాలను ముందుగానే తెరవనున్నారు.
అత్యవసర పరిస్థితుల కోసం అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉంచారు