Take a fresh look at your lifestyle.

కారు – పాఠశాల బస్సు ఢీ : ప్రభుత్వ వైద్యుడు మృతి

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ సంతాపం తెలిపారు

కారు మరియు ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు మృతి చెందిన విషాద ఘటన శనివారం కల్వకుర్తి మండలంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాయచూర్ – కోదాడ జాతీయ రహదారిపై కల్వకుర్తి మండల పరిధిలోని సీబీఎం కళాశాల సమీపంలో శనివారం ఉదయం కారు, ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ విజయ్ కుమార్ (43) తీవ్రంగా గాయపడ్డారు.

అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆయనను కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

డాక్టర్ విజయ్ కుమార్ పట్టణ సమీపంలోని వందేమాతరం ఫౌండేషన్ ఆవరణలో వ్యాయామం ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

మృతుడికి భార్య యశ్వంత్ రాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యశ్వంత్ రాణి కూడా వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన విజయ్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆయన మృతిపై పలువురు వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు స్నేహితులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.