35,290 రైతుల వినియోగం
ఈనెల 1 నుండి ఇప్పటివరకు 1,17,345 యూరియా సంచుల వినియోగం
యాప్ ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలు
జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష వెల్లడి
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ఈనెల 1వ తేదీన ప్రారంభించిన యూరియా బుకింగ్ యాప్ విజయవంతంగా అమలవుతూ రైతుల నుంచి విశేష స్పందన పొందుతోందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.ఉష పేర్కొన్నారు. ఈనెల 24 వరకు తక్కువ వ్యవధిలోనే మొత్తం 35,290 మంది రైతులు యాప్ ను వినియోగించుకున్నారని తెలిపారు. తద్వారా 1,17,345 యూరియా సంచులను సక్రమంగా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దీంతో యూరియా
యాప్ పై జిల్లా రైతుల నమ్మకం మరియు చురుకైన వినియోగాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని పేర్కొన్నారు. యూరియా యాప్ ద్వారా రైతులు అనేక ప్రయోజనాలను పొందారని వ్యవసాయ అధికారి గుర్తు చేశారు. ఇందులో ముందస్తు యూరియా బుకింగ్, రియల్ టైమ్ స్టాక్ వివరాల పారదర్శకత, ఎరువుల దుకాణాల వద్ద క్యూ లైను తగ్గింపు, క్రమబద్ధమైన, సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థ, ఎరువుల దుర్వినియోగం, మళ్లింపుల నివారణ వంటి ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించారు. రైతులు యూరియా యాప్ ద్వారా ముందుగానే బుకింగ్ చేసుకొని, అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సులభంగా యూరియా పొందుతున్నారని పేర్కొన్నారు. మండల వ్యవసాయ అధికారులు, , వ్యవసాయ విస్తరణ అధికారులు,ఎరువుల డీలర్లు, వాలంటీర్ల సమన్వయంతో ఈ యూరియా యాప్ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఉష తెలియజేశారు.