‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలి-అధికారులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశాలు
ఎజెండాలో అంశాలను అమలు చేస్తూ.. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
శంషాబాద్ మున్సిపాలిటీలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుతీరును క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
(ముద్ర,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమం ఎజెండాలో భాగంగా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ పైళ్లను త్వరగా పరిష్కరించాలని సూచించారు. సోమవారం జిల్లాలోని శంషాబాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ శంషాబాద్ లోని మున్సిపల్ కమ్యూనిటి హాల్ ను, బస్తి దవాఖాను సందర్శించి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అక్కడ చేపట్టిన పనులను పరిశీలించారు. బస్తీ దవాఖానకు వచ్చే వారికి అందిస్తున్న వైద్యం వివరాలు, మందుల వివరాలు డాక్టర్లను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బస్తీ దవాఖానలో చేస్తున్న రక్త పరీక్షలు, అందిస్తున్న వైద్య సేవలు, మందుల గురించి దవాఖానకు వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు నిర్వహించిన వివరాలు రిజిస్టర్ నందు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రతగా నిర్వహించాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జూన్ 12వ తేదీ వరకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలలో 99 రోజుల పాటు కార్యచరణ అమలు చేయాలని, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్లను పూర్తిగా పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు వారి పరిధిలోని అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేసి దశల వారీగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి కార్యాలయంలో ప్రజపాలన ప్రగతి ప్రణాళిక పనులు పక్కాగా అమలు చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రతి కార్యాలయంలో అవసరమైన చోట ఏమైనా మరమ్మత్తులు, పెయింటింగ్ పనులు ఉంటే పూర్తి చేయాలని, ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. రోజు వారీగా సేకరించిన తడి, పొడి చెత్తను సెక్రిగేషన్ కేంద్రాలకు తరలించాలని, నీటి నిల్వలు లేకుండా, దోమలు పెరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట శంషాబాద్ మున్సిపల్ జోనల్ కమిషనర్ చంద్రకళ, రాజేందర్ నగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితా దేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.