ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత కార్యాలయాల సమావేశము హాలు నందు నిర్వహించిన ప్రజావాణికి 289 దరఖాస్తులు స్వీకరించారు.
ప్రజావాణికి ప్రజలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వస్తారని వారికీ సంబంధించిన సమస్యల వివరాలతో ఇచ్చిన దరకాస్తు ను పరిశీలించి సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడం అధికారుల బాధ్యత అని అన్నారు.
ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి, అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని, అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించి స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, డిపిఓ, అటవీ శాఖ, డీఆర్‌డీఏ, వ్యవసాయ శాఖ, ప్రణాళిక శాఖ, గనుల శాఖ, భూ సేకరణ వివిధ జిల్లా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై పెండింగ్ ఫైల్స్ అన్నియు క్లియర్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు. వారంలోపు అన్ని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి, గత వారం అందిన దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించినవి, ఇంకా పెండింగ్‌లో ఉన్నవి పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను స్పష్టమైన నమూనాలో సమర్పించాలని ఆదేశించారు.
అనంతరం 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, గ్రామ పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా స్థాయిలో రోజువారీ షెడ్యూల్ ప్రకారం ప్రజలు,ప్రజా ప్రతినిధులు కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ప్రతి రోజూ చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వివరాలను కార్యక్రమం అనంతరం జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూపులో అప్లోడ్ చేయాలని, ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, రెవెన్యూ అదనపు కలెక్టర్ రాజేశ్వరి, జడ్పి సిఈఓ, సుదీర్, డిఆర్ డి ఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.