సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించారు.
జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి ఆరోగ్యం విషమించిందనే సమాచారం అందడంతో తన పర్యటనను వాయిదా వేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, ఆయనకు అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవని, ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుకున్నారు.