Take a fresh look at your lifestyle.

‘మా బాస్’.. కేసీఆర్-ఎంపీ ఈటలఆసక్తికర వ్యాఖ్యలు

యథాలాపమా? ఉద్దేశపూర్వకమా?

ముద్ర, తెలంగాణ బ్యూరో :
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్‌ను ‘మా బాస్’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ, ప్రజలే తనకు అండగా ఉన్నారని, తనతో ఉంటే లాభమే తప్ప నష్టం లేదని అన్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను ‘మా బాస్’ అనడంతో సభలో ఒక్కసారిగా జై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. ఈటెల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎంతో ఆచితూచి మాట్లాడతారని ఈటలకు పేరుంది. అలాంటి ఈటల తాజాగా మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా బాస్ కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
తాజాగా ఈటల రాజేందర్ మల్కాజిగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కులం, మతం లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తనకు పదవి ఇవ్వలేదని.. జనాలే తనను అక్కున చేర్చుకున్నారని.. వారి వల్లే తనకు ఈ పదవి వచ్చిందని తెలిపారు.

తనతో ఉంటే లాభం తప్ప నష్టం ఉండదన్నారు. నియోజకవర్గంలో చేపట్టే పనులన్నింటికీ.. కేంద్రం నుంచి నిధులను మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను అన్నారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి (మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు) బాస్ అదే మా బాస్ కేసీఆర్ అంటూ ఈటల ప్రస్తావించగానే.. సభలో ఒక్కసారిగా జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియాలోనైతే ఈటల మళ్లీ బీఆర్ఎస్‌లో చేరతారనే ప్రచారం కూడా మొదలైంది. గతంలో గులాబీ పార్టీలో కీలక నేతగా, మంత్రిగా ఈటల ఓ వెలుగు వెలిగారు. గులాబీ పార్టీకి తామే ఓనర్లమంటూ ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాల్సి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేశారు కూడా. అలాంటిది ఆయన నోట కేసీఆర్ మా బాస్ అనే మాట రావడం చర్చకు దారి తీసింది. ఈటల తిరిగి బీఆర్ఎస్‌లో చేరతారనే పోస్టులో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఆచితూచి మాట్లాడే నేతగా పేరున్న ఈటల..యథాలాపంగా ఈ మాటలు అన్నారా? లేదంటే భవిష్యత్తుకు సంకేతాలా? అనేది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.