భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ మూడు దశల్లో విస్తృత అభివృద్ధి పనులు – మంత్రుల సమీక్ష
ముద్ర, హైదరాబాద్ :
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి పాల్గొని మాస్టర్ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… భద్రాచలం ఆలయ అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా మూడు దశల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. భక్తుల అవసరాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకుంటున్న ఈ ప్రణాళికకు ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం తుదిరూపు ఇవ్వనున్నారు.
వచ్చే గోదావరి పుష్కరాల నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పుష్కర ఘాట్ నిర్మాణం, యాత్రికుల సౌకర్యాల విస్తరణ, రహదారి సదుపాయాల అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.
భద్రాచలాన్ని రాష్ట్రంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. అలాగే భద్రాచలం సమీపంలోని రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇక గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రాధాన్యం కలిగిన కొరివి వీరభద్రస్వామి ఆలయం, మల్లూరు నరసింహస్వామి ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, శాసనసభ్యులు తెల్లం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.