Take a fresh look at your lifestyle.

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  • రేవంత్ అనాలోచిత నిర్ణయాలతోనే ఆత్మహత్యలు
  • తమ కమిటీ వెనుక రాజకీయం లేదు
  • కేవలం రైతు సంక్షేమం కోసమే అధ్యయన కమిటీ
  • ఈ  24 నుంచి నెల రోజల పాటు రాష్ట్ర మంతటా కమిటీ పర్యటన 
  • లక్ష కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఒక్కరే

ముద్ర, తెలంగాణ బ్యూరో :- రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్ అన్నారు. రేవంత్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై వేసిన తమ కమిటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు. కేవలం రైతాంగానికి అండగా నిలబడాలన్న ఆలోచన తప్ప ఇంకేం లేదన్నారు.. బుధవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమావేశమైన అధ్యయన కమిటీ తొలి సమావేశం తరువాత కేటీఆర్  మీడియాతో మాట్లాడుతూ….ఇటీవల ఆదిలాబాద్ బ్యాంకులో ఆత్మహత్య చేసుకున్న రైతు విషాద ఘటనే ఈ కమిటీ వేయడానికి కారణమని చెప్పారు.

తమ పార్టీ అధినేత  కేసీఆర్  ఆదేశం మేరకు ఏర్పాటైన ఈ కమిటీ ఈ నెల 24వ తారీఖు నుంచి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి పని ప్రారంభిస్తుందన్నారు. రాబోయే నెల రోజులపాటు అన్ని జిల్లాలలో అన్ని వర్గాల రైతులను కలిసి రుణమాఫీ ఎంత మేరకు జరిగింది? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కరెంటు సరఫరా ఎలా ఉంది? సాగు పరిస్థితి ఎలా ఉంది? మద్దతు ధర దొరకుతుందా? బోనస్ ఏమైంది? కొనుగోలు కేంద్రాలు ఏమయ్యాయి? రైతు వేదికలు పనిచేస్తున్నాయా? వంటి అంశాలను అధ్యయనం చేస్తుందన్నారు.  రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటు ఆత్మహత్యలకు కారణాలను అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తుందన్నారు. ఆ నివేదికను బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందన్నారు. 

రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ నాయకత్వంలో  వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చిందన్న ఆయన…. రూ. 2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతు భరోసా, మద్దతు ధర, బోనస్ ఇవ్వడంతో పాటు విస్తారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తామని   కాంగ్రెస్ ఇ చ్చిన హామీలను నమ్మి రైతులు ఆ పార్టీకి అధికారాన్ని అప్పగించారన్నారు. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందన్నారు. రైతుల పట్ల కెసిఆర్ కు ఉన్న ప్రేమ, ఆర్తి ప్రస్తుత పాలకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న పెద్దల మాటను వందకు వంద శాతం నమ్మి అందుకు తగ్గట్టుగానే 65 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా ఆధారపడిన వ్యవసాయరంగ సంక్షేమానికి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను అమలుచేశారని చెప్పారు. రైతు బంధు, రుణమాఫీ పేరుతో లక్ష కోట్ల రూపాయలను నేరుగా 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి భారత దేశ చరిత్రలో కేసీఆర్ ఒక్కరే అన్నారు. 

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల్లో ఆత్మవిశ్వాసం అపారంగా ఉండేదని కేటీఆర్ తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, భూమిశిస్తు రద్దు, నీటి తీరువ రద్దు, చిన్న నీటి వనరులైన చెరువులను కాపాడే మిషన్ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు నిర్మాణాలతో స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చేయని విప్లవాత్మక పనులను రైతుల కోసం కేసీఆర్ చేశారన్నారు. రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణను కేంద్రప్రభుత్వమే పార్లమెంటులో గతంలో ప్రశంసించిందన్నారు. 

ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందన్న అపోహలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న కేటీఆర్…. తమ హయాంలో 6 లక్షల 47 వేల పైచిలుకు రేషన్ కార్డులను మీ-సేవ కార్యాలయాల్లో ఇచ్చామన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న పబ్లిసిటీ పచ్చి తమకు లేదన్నారు. రుణమాఫీ, రైతుబంధు గురించి గ్రామసభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. ప్రజలంతా స్వచ్చందంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్నారు. ఆ ఆందోళనల్లో ఎక్కడా తమ పార్టీ నేతలు లేరన్నారు. హోంమంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పడకేశాయని కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్షాల మీద అక్రమకేసులు బనాయించడం, సోషల్ మీడియా పోస్టులకు భయపడి అరెస్టుల చేసే తాపత్రయం సిఎం రేవంత్ ది అన్నారు. ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఫార్ములా కేసైతే, తమ ప్రాధాన్యత ఫార్మర్ అన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా త్వరలోనే నల్లగొండలో రైతు ధర్నా నిర్వహిస్తామన్నారు.

సభకు అనుమతి

ఈనెల 28వ తేదిన నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో తలపట్టిన రైతు ధర్నా కార్యక్రమానికి హై కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో దీనిని విజయవంతం చేసే బాధ్యతను ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు శ్రమిస్తున్నారు.  ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ రైతు ధర్నా కార్యక్రమానికి భారీగా రైతులను తరలించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.