మేము, వారు పేద ప్రజల కోసమే పోరాటం చేశాం
నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారు
పాకిస్తాన్‌తో చర్చలకు ఒప్పుకున్న మోడీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికైతే తాము ఏ మాజీ మావోయిస్టును పార్టీలో ఆహ్వానించలేదన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలైనా, మావోయిస్టులు అయినా పేద ప్రజల కోసమే పోరాటం చేశామన్నారు. మావోయిస్టు, తమ సిద్ధాంతాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. అయినా ప్రజల కోసం పోరాడిన వాళ్లపై గౌరవం ఉంటుందని చెప్పారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారని చెప్పారు. ఆపరేషన్ కగార్‌ను తాము మొదటి నుంచి వ్యతిరేకించామని చెప్పారు. అయితే పాకిస్తాన్‌తో చర్చలకు ఒప్పుకున్న మోడీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదని ఆరోపించారు. తెలంగాణ కోసం పని చేసిన వారిని బీఆర్ఎస్ ఏనాడూ గౌరవించలేదని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా కొన్ని కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఆయా పదవులపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. ఖమ్మం జిల్లా వెనుగుమట్లలో భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి కేరళ సీఎం పినరయి విజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారు. రాజకీయాల కోసమే పినరయి విజయ్ మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తరపు నుంచి రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు. వీరిలో నలుగురు సమర్ధులైన బీసీలు తమకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని తెలిపారు.ఈ నెల 2న డీసీసీల శిక్షణ ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన రాహుల్ గాంధీతో రాజ్యసభ సభ్యుల గురించి 30 నిమిషాల పాటు చర్చించినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఢిల్లీ పిలుస్తామని రాహుల్ గాంధీ తమతో చెప్పారన్నారు. అయితే అగ్రనేతలు తమను ఢిల్లీకి పిలుస్తారా? ఫోన్లో చర్చిస్తారో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పుడే రాష్ట్రం నుండి ఒకరికి ఇస్తారా? లేదా ఇద్దరికి ఇస్తారా? అనేది తెలుస్తుందన్నారు. ప్రచారం జరుగుతున్నట్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు రాజ్యసభ అవకాశం ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణ కోసం పని చేసిన వాళ్ళలో ఒక్కరికీ అవకాశం ఇవ్వలేదన్నారు. శిక్షణ కార్యక్రమంలో కొందరు డీసీసీ అధ్యక్షులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమకు సహకరించడం లేదని ఫిర్యాదు చేసినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఫిర్యాదు అందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై రాహుల్ గాంధీ తనను దృష్టి పెట్టమని ఆదేశించారన్నారు. వెంటనే ఆయా ఎమ్మెల్యేలతో మాట్లాడిన తాను వారిని మందలించానని టీపీసీసీ చీఫ్ వివరించారు.