చిన్నపాటి ఘర్షణలకు మతం రంగు పూస్తే కఠిన చర్యలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి చర్యలు తప్పవు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మద్యం మత్తులో జరిగే చిన్నపాటి గొడవలు, చిల్లర తగాదాలు, సాధారణ రోడ్డు ప్రమాదాలు వంటి ఘటనలకు కొంత మంది ఆకతాయిలు మతం రంగు పూసే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని నిర్మల్ ఎ ఎస్పీ సాయి కిరణ్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో ప్రజల మధ్య ఉద్రిక్తతలు, విద్వేషాలను సృష్టించే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేయడం, సంఘటనలను వక్రీకరించి మతపరమైన కోణంలో చూపించడం వంటి చర్యలను కఠినంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా నిజానిజాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. అనుమానాస్పద అంశాలు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.