Take a fresh look at your lifestyle.

99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం అవసరం-సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక’పై నిర్లక్ష్యం వద్దు
పనుల పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్
99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం అవసరం
గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలి
రేషన్ కార్డులు, సన్నబియ్యంపై లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఇందిరమ్మఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలి
మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లుల చెల్లించాలి
సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :
సంక్షేమ పథకాలు.. అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహించతలపెట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో వార్డు స‌భ్యులు, స‌ర్పంచులు, మున్సిప‌ల్ వార్డు స‌భ్యులు, ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, మేయ‌ర్లు, సెలబ్రెటీలను భాగ‌స్వాముల‌ను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అందుకోసం వార్డు స‌భ్యులు, స‌ర్పంచులు, ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, మేయ‌ర్లు అంద‌రికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయాలని సూచించారు. వారి విధులు, బాధ్య‌త‌లకు సంబంధించి అవ‌గాహ‌న క‌ల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియ‌ల్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి… పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను నమ్మి పట్టం కట్టారన్న సీఎం వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ బృహత్తర యజ్ఞంలో కలెక్టర్లూ భాగస్వాములై.. గ్రామీణ, పట్టణ ప్రజల సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడాలన్నారు.
రానున్న 99 రోజులు జిల్లా కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్ రెడ్డి.. తమ పరిధిని దాటి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కారించడం కోసమే అధికార యంత్రాంగం పనిచేయాలని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. క్షేత్ర స్థాయిలో ప్రతీ అర్హుడికి అందాలని సీఎం అన్నారు. కింది స్థాయిలో అధికార యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని.. ప్రభుత్వ పథకాలు, సేవల్లో పారదర్శకత పెరగాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి చేకూరే లబ్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని సీఎం రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని.. ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజల అభిప్రాయాలు సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీల్లో గ్రామ సభల వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతీ పైసా లబ్ధిని ప్రజలకు వివరించడం ద్వారా ప్రభుత్వం తరఫున పారదర్శకత పెరుగుతుందని వెల్లడించారు.గ్రామ, వార్డు స‌భ‌లు నిర్వహించి నూత‌నంగా ఇచ్చిన రేష‌న్ కార్డులు, స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌, రుణ‌మాఫీ, ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ ల‌బ్ధిదారుల వివ‌రాలు తెలియ‌జేయాలి. వాటితో గ్రామ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గం, జిల్లా స్థాయి క‌లిగిన ల‌బ్ధిని ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించాలని సూచించారు. అలాగే తెలంగాణ విద్యా వ్యవస్థలో తమ ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ స్కూళ్లు బలోపేతం అయ్యే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను ప్రతీ నెలా ఆయా ఏజెన్సీలకు చెల్లించాలని ఆదేశించారు.
ఈ పథకానికి నిధుల కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లకే ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులను మరింత పటిష్ఠం చేసేందుకు వాటి సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీలతో హాస్పిటల్స్‌ను అనుసంధానం చేయాలని సూచించారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న సీఎం.. వ్య‌వ‌సాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని సూచించారు. సోలార్ మోటార్ల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలను రైతుల‌కు వివ‌రించాలన్నారు. ఇళ్ల‌పైన సోలార్ ప్లాంట్లు అమ‌ర్చుకోవ‌డం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవ‌గాహ‌న కల్పించాలన్నారు.
రాష్ట్రంలో ఉన్న 35 ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల సేవ‌లు ప్ర‌జ‌ల‌కు అందేలా చూడాలని సీఎం సూచించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఇత‌ర స్థానిక వైద్య సంస్థ‌లు ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కే  రిఫ‌ర్ చేయాలన్నారు. మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లోఅత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన ప‌రిక‌రాలతో పాటు వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రొఫెస‌ర్లు ఉన్నారనీ వారి సేవ‌లను స‌ద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్ర‌తి ప్ర‌భుత్వ ప‌థ‌కంలో ల‌బ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్‌) చేప‌ట్టాలని సీఎం.. కలెక్టర్లను ఆదేశించారు. అర్హుల‌కు క‌చ్చితంగా ల‌బ్ధి జ‌ర‌గాల్సిందేనన్న సీఎం.. అదే స‌మ‌యంలో అన‌ర్హులు ల‌బ్ధిపొంద‌కూడ‌దని హెచ్చరించారు. ఆస‌రా పింఛ‌న్ల‌లో ముఖ గుర్తింపు చేప‌ట్ట‌డంతో 3 ల‌క్ష‌ల మంది అన‌ర్హుల పేర్లు తొల‌గించ‌గ‌లిగామనీ సాంకేతిక‌త‌ను స‌రిగా వినియోగించుకోక‌పోవ‌డంతోనే ఇంత పెద్ద సంఖ్య‌లో అనుచిత ల‌బ్ధి పొందేవారని చెప్పారు. 99 రోజుల ప్రణాళికలో ర‌వాణా శాఖ డాటా ఆన్‌లైన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  పాఠ‌శాల‌లు బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల‌కు ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించాలని సూచించారు. ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ల‌తో పాటు లారీలు, ఇత‌ర స‌ర‌కు ర‌వాణా వాహ‌నాల డ్రైవ‌ర్ల‌కు కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలన్నారు. ఎక్కువ సంఖ్య‌లో డ్రైవ‌ర్లు క‌లుసుకునే చోట్ల‌నే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలని దిశానిర్దేశం చేశారు. ర‌హ‌దారుల‌పై భారీ స్థాయిలో గుంత‌లు, ప్ర‌మాదం జ‌రిగే స్థ‌లాల వివ‌రాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబ‌ర్ ను ఇవ్వాలని ర‌వాణా శాఖను ఆదేశించారు. ఆ నంబ‌ర్‌కు వ‌చ్చే స‌మాచారం ఆధారంగా అక్క‌డ మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టడం, ఇత‌ర జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చేయాలన్నారు. ఓఆర్ఆర్‌, ఓఆర్ఆర్ స‌ర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త‌, ఇత‌ర నిర్మాణ వ్య‌ర్ధాలు డంప్ చేస్తున్నారన్నారు. వ్య‌ర్ధాల‌ను తీసుకువ‌చ్చే వాహ‌నాల‌ను ప‌ట్టుకొని జ‌రిమానాలు విధించడంతో పాటు కేసులు పెట్టాలన్నారు. ఓఆర్ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలన్నారు. మ‌ధ్యాహ్న భోజ‌న ఏజెన్సీలకు  ప్రతి నెలా బిల్లులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లించాలన్నారు. పిల్ల‌ల‌కు పోషకాహారం అందాలనీ అందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించుకోవాలని సూచించారు. మూడు కార్పొరేష‌న్ల‌తో పాటు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని వ‌ర్కింగ్ ఉమెన్స్ హాస్ట‌ళ్లు, బాయ్స్‌, గ‌ర‌ల్స్ హాస్ట‌ళ్ల వివ‌రాలు న‌మోదు చేసుకోవాలన్నారు. ఆయా హాస్ట‌ళ్ల ఏర్పాటుకు అనుమ‌తులు, వాటిపై ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాలన్న సీఎం.. వాటి యాజ‌మాన్యాల‌కు జ‌వాబుదారీత‌నం ఉండాలని సూచించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో గంజాయి, డ్ర‌గ్స్‌, ఈ-సిగ‌రెట్ల వినియోగం జ‌రిగితే అందుకు ఆయా విద్యా సంస్థ‌ల యాజ‌మాన్యాలు బాధ్య‌త వ‌హించాలనీ సీఎం స్పష్టం చేశారు. ప్ర‌తి ప్రైవేటు, కార్పొరేట్ పాఠ‌శాల‌, క‌ళాశాల‌ల్లో స‌బ్జెక్ట్ టీచ‌ర్స్‌, పీఈటీ ఎలా ఉంటారో అలానే సైకాల‌జిస్ట్ ఉండేలా చూడాలని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్య‌వ‌సాయ శాఖ భూసార ప‌రీక్ష‌లు చేప‌ట్టి స‌కాలంలో రైతుల‌కు వాటి స‌మాచారం అంద‌జేయాలని సీఎం సూచించారు. ఏ భూమిలో ఏ పంట బాగా పండుతుంది అనే విష‌యం రైతుల‌కు వివరించాలన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట‌లు సాగు చేసేలా అన్న‌దాత‌ల‌ను ప్రోత్స‌హించడంతో పాటు పంట మార్పిడి, పంట‌ల వైవిధ్య‌త ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించాలని ఆదేశాలు జారీ చేశారు. యూరియా యాప్‌లో కొంత గంద‌ర‌గోళం ఉన్న‌ట్లు రైతులు ఆందోళన చెందుతున్నారని సీఎం చెప్పారు. దానిని సులువుగా వినియోగించేలా మార్పులు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. నానో యూరియా ఉప‌యోగాలను క్షేత్ర‌స్థాయిలో ప్ర‌ద‌ర్శ‌న ద్వారా రైతుల‌కు చూపించాలని సూచించారు. వ్య‌వ‌సాయ శాఖ‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. పంట‌లు వేసే మొద‌లు పంట ఉత్ప‌త్తుల అమ్మ‌కం వ‌ర‌కు స‌రైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ఉంటేనే  ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. ఈ విష‌యంలో ఈ రెండు శాఖ‌లు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగాలన్నారు. త‌మ జిల్లాల్లో పంట‌ల వైవిధ్య‌త‌కు ఉన్న అవకాశాలపై నివేదిక స‌మ‌ర్పించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు.
‘స్ధానికం’గా ఉండాల్సిందే
సదస్సులో పలువురు కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కలెక్టర్లు.. ఆయా జిల్లా హెడ్ క్వార్టర్లలో నివాసం ఉండటం లేదని.. ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు అంటే అదే జిల్లాలో ఉండాలని.. అక్కడి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. అలా లేని వారిని సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. పద్దతి మార్చుకోని కలెక్టర్లపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ సదస్సులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక
అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్
ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖ గా వ్యవహరిస్తుంది.
ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ
ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం
మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం
మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక
——–
శాఖల వారీగా 10 వివిధ థీమ్ లతో 99 రోజుల కార్యక్రమం
1. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు  పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్
2. ఆరోగ్యం
3. అరైవ్.. అలైవ్
4. సంక్షేమం
5. పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట
6. రైతు సంక్షేమం.. వ్యవసాయం
7. విద్య
8. యువత.. క్రీడలు
9. మహిళలు
10. పర్యావరణం
===============
ఈ నెల 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు
99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్.
===

Leave A Reply

Your email address will not be published.