కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లు
ఎమ్మెల్యే కాటేపల్లి, పార్టీ శ్రేణులకు రాష్ట్ర నాయకుల మద్దతు
బాన్సువాడ వెళ్లేందుకు సిద్ధమైన రాష్ట్ర నాయకులు
ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
బీజేపీ నాయకులు జిల్లాలో ప్రవేశించకుండా చెక్ పోస్టులు
హైదరాబాద్ లో టీబీజేపీ చీఫ్ హౌజ్ అరెస్ట్
శంకర్ పేట వద్ద ఉద్రిక్తత
ప్రభుత్వ తీరుపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి ఆగ్రహం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కామారెడ్డిలో స్ధానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ వర్గాల మధ్య తలెత్తిన వివాదం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఎమ్మెల్యే కాటేపల్లి ప్రభుత్వ పాఠశాల, కాలేజీ భూములను కబ్జా చేశారంటూ షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలు ఈ ఆందోళనలకు ఆజ్యం పోసింది. భూ కబ్జా ఆరోపణలను నిరూపించాలంటూ కాటేపల్లి చేసిన సవాల్ కు షబ్బీర్ అలీ ‘సై’ అనడం…. ఈ నెల 20న అర్ధరాత్రి ఇరు పార్టీ శ్రేణులు రోడ్లపైకి రావడం.. మరుసటి రోజు కాటేపల్లి ఇంటిపై దాడికి కాంగ్రెస్ శ్రేణులు విఫలయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు గత మూడు రోజుల నుంచి కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య నెలకొన్న సవాళ్లు ప్రతిసవాళ్లతో కామారెడ్డిలో యుద్ధ వాతావరణం నెలకొంది. కలెక్టరేట్ వేదికగా తేల్చుకుందామంటూ ఇరు పార్టీల నేతలు రంగంలోకి దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టరేట్ వద్దే అన్ని విషయాలు తేల్చుకుందామని ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో రాజకీయ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. కాగా ఎమ్మెల్యే కావాలనే ప్రధాన సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు కామారెడ్డి పట్టణంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు జిల్లాలో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
టీబీజేపీ చీఫ్ అరెస్ట్
ఈ వివాదం నేపథ్యంలో బాన్సువాడ వెళ్లేందుకు ఆదివారం ప్రయత్నించిన పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులను హైదరాబాద్ పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. బీజేపీ నాయకులెవరూ కామారెడ్డి, బాన్సువాడ వైపు రాకుండా సరిహద్దు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. తార్నాకలోని తన నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో పోలీసుల తీరుపై రాంచందర్ రావు మండిపడ్డారు. బాన్సువాడలో తమ ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆరోపించిన ఆయన కారును ధ్వంసం చేసింది కాంగ్రెస్ నేతలే అన్నారు. కానీ తిరిగి తమపైనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులకు దిగడం కాంగ్రెస్ సంస్కృతిగా మారిందని మండిపడ్డారు. అక్కడ బీజేపీ కార్యకర్తలు తమ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎట్టి పరిస్థితుల్లోనూ బాన్సువాడ వెళ్లి తీరుతామని రామచందర్ రావు స్పష్టం చేశారు. మరోవైపు రాంచందర్ రావు కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటివద్దకు భారీగా చేరుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రాంచందర్ రావు, పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాన్సువాడకు బయలుదేరిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేసి రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
రాష్ట్రంలో రేవంతుద్దీన్ అరాచక పాలన : ఎంపి ధర్మపురి అర్వింద్
రాష్ట్రంలో రేవంతుద్దీన్ అరాచక పాలన నడుస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. హౌజ్ అరెస్టులతో బీజేపీ నేతలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో హిందువులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాటేపల్లిపై దాడి జరిగి రెండ్రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు స్పీకర్ ఆరా తీయకపోవడం దారుణమన్నారు. కేవలం 15 శాతం ఓట్ల కోసం ఎంఐఎంకు కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కంటే.. రేవంత్ రెడ్డి వెరీ డేంజరస్ సీఎం అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పేర్లు మార్చుకోవాలని హితవు పలికారు. శ్రీధర్ బాబు.. శ్రీధర్ బాబాగా, భట్టి విక్రమార్క భట్టి అక్రమ్‌గా మార్చుకోవాలని సూచించారు.
అక్కడే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే కాటేపల్లి
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో శనివారం జరిగింది ట్రైలర్ మాత్రమేనన్న ఆయన… అసలు సినిమా ముందుందన్నారు. తనను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారన్నారు. నేటి నుంచే గ్రామాల్లోకి వెళ్తానన్న ఆయన ఎవరు..? ఎలా..? అడ్డుకుంటారో చూస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అభివృద్ధి విషయంలో ఆయనకు స్వాగతం పలుకుతానన్నారు. కాలేజీ భూముల విషయంలో తనపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి కాంగ్రెస్ నాయకులు రావాలని, సోమవారం నేనే కలెక్టరేట్‌కు వస్తానన్నారు. అక్కడ కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్‌లు కూడా ఉంటారన్నారు. వారి సమక్షంలోనే ఆధారాలను తీసుకువచ్చి నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానన్నారు.
ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ అరాచకాలు : కేంద్రమంత్రులు బండి, కిషన్ రెడ్డి
రాష్ట్రంలో ఎంఐఎం , కాంగ్రెస్ పార్టీలు కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎంను కాపాడటానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అమానుషమన్నారు. కామారెడ్డిలో జరిగిన గొడవలకు కాంగ్రెస్సే అగ్నికి ఆజ్యం పోసిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. బండి సంజయ్ ఆదివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడగా, కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రౌడీ రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు పునరావృతమవుతున్నాయని చెప్పారు. ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. బాన్పువాడ ఘటనలో రాళ్ల దాడి స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆత్మరక్షణ కోసం ప్రయత్నిస్తే, తిరిగి తమపైనే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటని కౌంటర్ ఇచ్చారు. బాన్సువాడలో 70 మంది బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన అరాచక ఘటనలను ప్రజలు గుర్తుంచుకోవాలని, రౌడీయిజం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.