సబ్ ప్లాన్ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి : డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరుపాక అనిల్ కుమార్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
మంగళవారం దళిత హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా సమితి సమావేశం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో కాశపాక దయాకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం దళితులు, ఆదివాసుల జనాభా శాతానికి అనుగుణంగా నిధులు కేటాయించి, ఆ వర్గాల విద్య, ఉపాధి, ఆరోగ్యం, గృహాలు, భూమి పంపిణీ వంటి రంగాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని అనేక శాఖలు ఈ నిధులను ఇతర పథకాల కింద చూపించడం లేదా ఖర్చు చేయకుండా నిల్వ చేయడం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ దళితులు ఇంకా విద్య, ఉపాధి, ఆర్థిక రంగాల్లో తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సబ్ ప్లాన్ నిధులు వారికి అత్యంత అవసరమని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి సలిగంజి వీరాస్వామి, జిల్లా నాయకులు ఇంజ హేమలత, భాగ్య, కొమ్ము బాల నర్సింహా, లింగస్వామి, మూల పోచయ్య , చెడె సుందర్, శాంతి కుమార్, రమేష్, స్వామి, మనోహరమ్మా పాల్గొన్నారు.