Take a fresh look at your lifestyle.

సిట్.. లైట్

సిట్.. లైట్
కేసీఆర్ విచారణ లో ఏం జరిగింది..?
సీఎంకు సంబంధం ఏమిటంటూ ప్రశ్నించిన కేసీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్ట్స్ ఏంటి..?
విచారణలో తేలిందేమిటి

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను విచారించిన సిట్.. విచారణలో ఏం తేలిందనేది హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 25 ప్రశ్నలతో వెళ్లిన సిట్ అధికారులకు కేసీఆర్ నుంచే ఎదురు ప్రశ్నలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సిట్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ నుంచి ఒకే సమాధానం వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా సీఎంకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఇంటలీజెన్సీ వర్గాలదేనని, ఎలా సమాచారం సేకరించారో సీఎంకు ఎలా తెలుస్తుందని, తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటుందని కేసీఆర్ ఎదురు ప్రశ్నించినట్లు టాక్. అంతేకాదు.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు.. అప్పుడు సీఎంగా తనకు ఏం సంబంధం లేదంటూ కేసీఆర్ పదేపదే చెప్పినట్లు సమాచారం.

అధ్యంతం ఉత్కంఠ
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆదివారం సిట్ అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 వరకు విచారించారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు పెట్టి ఆరుగురుతో కూడిన సిట్ ఆయన్ని ప్రశ్నించినట్టు ప్రచారం సాగుతోంది. విచారణ నందినగర్‌లోని ఆయన నివాసంలో సాగుతుంటే మోరోవైపు ఆ ఇంటి పరిసర ప్రాంతాలు, తెలంగాణ భవన్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకొని కట్టడి చేశారు. అయితే, కేసీఆర్ ను విచారిస్తున్నంత సమయం రాష్ట్రంల ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

లైట్ తీసుకున్న కేసీఆర్..
సిట్ విచారణను కేసీఆర్ చాలా తేలిగ్గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. సిట్ విచారణ గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. రాత్రి ఏడున్నరకు విచారణ పూర్తి అయిన తర్వాత కేసీఆర్‌ నంది నగర్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. చాలా యాక్టివ్‌గా కనిపించారు. సిట్‌ విచారణపై ఆయన మీడియాతో మాట్లాడతారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సిట్ విచారణ జరిగిన తీరుపై లాయర్లు, కేటీఆర్, హరీష్‌తో చర్చించినట్టు సమాచారం అందుతోంది. అంతే తప్ప ఇంకా ఎక్కడ కూడా సిట్ ప్రస్తావన రాలేదని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏదో కేసులో విచారణ అయింది అనే ఆందోళన కూడా ఎక్కడా కనిపించలేదు.

ఎవరు ఎవరిని ప్రశ్నించారు..?
విచారణకు వెళ్లిన సిట్ బృందాన్ని కేసీఆర్ ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం లేదు. విచారణకు వెళ్లిన టీం.. ఏదైనా ప్రశ్న కేసీఆర్ ను అడిగితే.. తనకు సంబంధం లేదంటూ కేసీఆర్ ఆన్సర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా జరిగింది.. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారనే వివరాలపై కేసీఆర్ ను ప్రశ్నిస్తే.. అదంతా ఇంటలీజెన్సీ పని అంటూ చెప్పుకొచ్చినట్లు సమాచారం.

మున్సిపాలిటీ ఎన్నికలపై కేసీఆర్ రివ్యూ
సిట్ విచారణ తర్వాత నందినగర్ నివాసంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో ప్రత్యేకంగా కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నిలపై చర్చించారు. అభ్యర్థుల విజయావకాశాలపై ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఇన్‌ఛార్జ్‌లతో ప్రతి మున్సిపాలిటీ గురించి అడిగి తెలుసుకున్నారు. రెబల్స్ ఎక్కడెక్క ఉన్నారు. వారితో మాట్లాడి నామినేషన్లు ఉపసంహరించేలా చేయాలని చెప్పారు. కచ్చితంగా ఎక్కువ మున్సిపాలిటీలు గెలుస్తున్నామని నేతలకు కేసీఆర్ చెప్పారు.

మనదే బలం
బీఆర్‌ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉందని కేసీఆర్ నేతలకు తెలిపారు. క్షేత్రస్థాయి సమాచారం తనకు ఎప్పటికప్పుడు వస్తుందని వివరించారు. మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు చూస్తామన్న ఆయన ప్రజల ఆదరణ బీఆర్‌ఎస్‌ వైపే ఉందని పేర్కొన్నారు. తొందరపాటుతో పార్టీ మారిన చాలా మంది మళ్లీ గులాబీ గూటికి వచ్చేందుకు రెడీ అవుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు చాలా మంది సంప్రదిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి సీనియర్లు, కీలక నేతలు గులాబీ కండువాలు కప్పుకోనున్నారని హింట్ ఇచ్చారు. భారీగా చేరికులతో ఉన్న వారికి ఇబ్బంది రాదని హామీ
ఇప్పుడు ఉన్న నేతలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నేతల చేరికలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. అందరికీ ప్రాధాన్యత ఇస్తామని, కొత్తగా చేరేవారిని కలుపుకొని వెళ్లాలని సూచించారు. ప్రజల్లో పార్టీ మంచి మైలేజీ వస్తుందని ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులకే గుర్తింపు వస్తుందని హితవు పలికారు. కొత్తగా వచ్చిన వారిని ఇప్పుడు ఉన్న వారిని సమన్వయం చేసుకొని సాగాలని తెలిపారు. ఈ సమావేశం తర్వాత ఆయన ఎర్రవల్లికి తిరిగి వెళ్లిపోయారు.

Leave A Reply

Your email address will not be published.