Take a fresh look at your lifestyle.

గల్ఫ్ కు విమానాలు బంద్

శంషాబాద్ నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియాకు సర్వీసులు రద్దు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో నిర్ణయం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతుండటంతో అనేక దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా మిడిల్ ఈస్ట్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దీని ప్రభావం పడింది. శంషాబాద్ నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియాలోని ఇతర ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు తాజాగా రద్దు అయ్యాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం, గత నెల 28న ఒక్కరోజే మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా సుమారు 900 నుండి 966 విమాన సర్వీసులు రద్దు కాగా, ఆదివారం కూడా మరో 716 నుండి 800 పైగా విమానాలు రద్దయ్యాయి. భారత విమానయాన రంగంపై కూడా దీని ప్రభావం భారీగా పడింది.. దేశవ్యాప్తంగా ఈ నెల 28 నాటి 410 రద్దులకు తోడు, ఆదివారం మరో 444 విమానాలు రద్దయ్యాయి. ఇందులో ప్రధానంగా ఇండిగో మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు చెందిన సర్వీసులు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాణికుల కోసం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందే తమ విమాన స్థితిని ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తప్పనిసరిగా సరిచూసుకోవాలని సూచించింది. రద్దు అయిన విమానాలకు సంబంధించి పూర్తి రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప ఈ దేశాలకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమమని డీజీసీఏ స్పష్టం చేసింది.

అప్రమత్తంగా ఉండండి : మంత్రి పొన్నం
గల్ఫ్ దేశాల్లో యుద్ధం దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని ఆయా దేశాల్లో చాలా మంది తెలంగాణ వాళ్లు ఉన్నారనీ ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో క్షేమంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర సహకారంతో రాష్ట్ర ప్రజలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

అయ్యన్న.. ఆరా
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగువారి భద్రతపై ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 50 వేల మంది వరకు బహ్రెయిన్‌లో వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లారు. ఎన్నారై శెట్టి సతీశ్కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా ఫోన్ చేసి, అక్కడి తెలుగువారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. బహ్రెయిన్లో ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. ఎటువంటి ఆపద వచ్చినా ఏపీఎన్ఆర్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని భరోసా కల్పించారు.

Leave A Reply

Your email address will not be published.