తెలంగాణ ప్రజల డీఎన్ఏలో టెక్స్‌టైల్స్
ప్రపంచం మొత్తం తెలంగాణలో తయారైన దుస్తులు ధరించాలి
నిర్దేశించుకున్న విజన్ లో పారిశ్రామిక వేత్తలు భాగస్వాములుకావాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. టెక్స్‌టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో తమతో భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయాలన్నది తమ సంకల్పమన్న సీఎం… తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ తో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో సీఎం అటెక్స్‌కాన్-2026 నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్స్‌టైల్స్ తెలంగాణ ప్రజల డీఎన్ఏలో ఉందని వ్యాఖ్యానించారు. నిజాం కాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్ నగరానికి వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలదన్నారు. వస్త్ర పరిశ్రమలో తెలంగాణ ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలున్నాయని వివరించారు. దేశంలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నామన్నారు. ఇక్కడి పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా పేరుందన్నారు.. టెక్స్‌టైల్ తెలంగాణకు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. ప్రజల జీవనాధారమని పేర్కొన్నారు. ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వరకు అనేకం ఇక్కడున్నాయని వెల్లడించారు. తెలంగాణలో నైపుణ్యం, మంచి సంకల్పం కూడా ఉందన్నారు. అందుకే డీప్‌టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ వంటి అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. వరంగల్‌లో కాకతీయ ప్రపంచ స్థాయి మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. అందులో అనేక అప్పరెల్ పార్కులున్నాయన్నారు. వస్త్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తుందన్నారు. ప్రపంచ పోటీకి అనుగుణంగా విధానాలు అనుసరిస్తున్నామన్న సీఎం… అత్యుత్తమ మానవ వనరుల బలం ఉందని వివరించారు. తెలంగాణలోని పత్తి పొలాలకు.. లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోలకు అనుసంధానం కావాలని సీఎం ఆకాంక్షించారు. మీకు విజన్ ఉంటే, మేము సరైన భాగస్వాములం అవుతామని పారిశ్రామిక వేత్తలకు సీఎం కోరారు. అందరం కలిసి, ప్రపంచాన్ని మార్చగల టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
సినిమా హబ్ గా హైదరాబాద్ :
హైదారాబాద్ గ్లోబల్ సినిమా హబ్ గా ఎదుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించినట్లు చెప్పారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుండగా, ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరిందన్నారు. సినిమా సంబంధిత ఫ్యాషన్ రంగాన్ని కూడా తెలంగాణ నుంచే అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామనీ అలాగే సంప్రదాయ ఆలోచనలతో పాటు ఆధునిక పరికరాలతో కలిపి డిజైన్, కట్టింగ్, స్టిచింగ్‌లో యువతకు ముఖ్యంగా మహిళలకు శిక్షణనిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, అధికారులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.