- ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్య ప్రసాద్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ గోడ పత్రిక విడుదల.
కుషాయిగూడ, ముద్ర విలేఖరి: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ కు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఏఐ వైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్ తెలిపారు. శనివారం ఈసీఐఎల్ చౌరస్తాలో విద్యాసంస్థల బంద్ గోడపత్రికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా విద్యార్థి, యువజన సంఘాలు పోరాటాలు చేస్తున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోకడం వల్లనే విద్యారంగం కుంటుపడిందని, దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనన్నారు. అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఇఓ, డీఈఓ, తదితర పోస్టులను భర్తీ చేయాలని, ఇంటర్మీడియట్ కళాశాలల్లో అవినీతిని, గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న 8వేల కోట్ల రూపాయల విద్యార్థుల ఉపకార వేతన బకాయిలను, బోధనా రుసుములను లను విడుదల చేయాలని, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి, నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చేయాలని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, యూత్ డిక్లరేషన్ ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బంద్ కు ఏఐవైఎఫ్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొంటారని, అదే విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు సహకరించి బందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సాయిలు, రవి, కుమార్, రవళి, ఫాతిమా, అనసూయ పాల్గొన్నారు.