- ట్రంప్, మోడీ విధానాలతో దేశ ప్రజలకు ప్రమాదం.
- కార్మిక వర్గాన్ని బానిసల్ని చేయడం కోసమే 4 లేబర్ కోడ్ లు.
- దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలే పరిష్కారం.
- సీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు.
ముద్ర ప్రకతినిధి, మెదక్: అమెరికా అధ్యక్షులు ట్రంప్ పెడుతున్న ఆంక్షలను తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రధాని మోడీ సామ్రాజ్యవాదానికి అతి పెద్ద బానిసగా వ్యవహరిస్తున్నాడని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబు విమర్శించారు. శనివారం మెదక్ లో సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభల సందర్బంగా ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. సాయిబాబా మాట్లాడుతూ… ట్రంపు మోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు దేశ ప్రజలకు ప్రమాద ఘంటికలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వర్గాన్ని బానిసల్ని చేయడం కోసమే మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్లతో పాటు విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్దతు తెలుపుతూ లేబర్ కోడ్లు అమలు చేసేందుకు పని గంటలు పెంచుతూ జీవోలు జారీ చేస్తున్నాయన్నారు. బిజెపి మంత్ర తంత్రంగా మతాన్ని వాడుతూ ప్రజలు కార్మికుల్ని సమ్మిళితం కాకుండా చీలికలు చేస్తూ పాలిస్తుందన్నారు. కార్మికుల ఆర్థిక, సామాజిక స్థితిగతులనుబట్టి కనీస వేతనాలు నిర్ణయించాల్సిన ఇండియన్ లేబర్ కాంగ్రెస్ను నిర్వీర్యం చేసిన మోడీ ప్రభుత్వం పదేళ్లుగా కనీస వేతనాలు పెంచేందుకు కమిటీలు వేయలేదన్నారు. రాష్ట్రంలోని 10 ఏళ్ల టిఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కనీస వేతనాలు పెంచకుండా కార్మికులకు ద్రోహం చేస్తున్నాయన్నారు. మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన పోరాటాలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలోని కార్మిక సంఘాలను సంఘటితంచేస్తూ కార్మిక ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తున్న సిఐటియు సంస్థాగత మహాసభలను జరుపుకోబోతుందన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు చూపలేని పరిష్కారాలను సోషలిజం మాత్రమే చూపగలుగుతుందని విశ్వసిస్తున్న సిఐటియు రాబోయే కాలంలో వర్గ పోరాటాలకు మరింత పదును పెట్టేందుకు సిద్ధమవుతుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 7-9 తేదీలో సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లా కేంద్రంలో జరగనున్నాయి. కార్మిక పోరాటాలకు శక్తిని, ఆక్సిజన్, సత్తువను ఇచ్చే ఉమ్మడి మెదక్ జిల్లా ఐదవ రాష్ట్ర మహాసభలకు అతిద్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సిఐటియు అంటే ఒక సంఘం కాదని దేశంలోని అన్ని కార్మిక సంఘాల్ని సంఘటన చేసే శక్తి అని ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్ల కాలంలో ప్రజలు, కార్మికుల ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏమిటి అనేది మాహాసభల్లో చర్చించి పోరాట కర్తవ్యాలు నిర్దేశించుకుంటామని అన్నారు.
జెండాలు ఎన్ని ఉన్నా కార్మిక వర్గానికి సిఐటియు జెండా మాత్రమే అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ స్పష్టం చేశారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ముందుండి పోరాడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 700 యూనియన్లకు పైగా సిఐటియు అనుబంధంగా పనిచేస్తున్నాయని చైతన్యవంతమైన కార్మిక వర్గంగా నిలుస్తుందన్నారు.శ్రమ దోపిడీ పోవాలి… శ్రామికులే పాలకులవ్వాలి అనే నినాదంతో సమసమాజ స్థాపన కోసం ఎర్రజెండా నీడన కార్మిక పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న సిఐటియూ 50 ఏళ్లుగా సమరశీల పోరాటాలను నిర్వహిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు ఆహ్వాన సంఘం చైర్మన్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సిఐటియు జీతభత్యాల పోరాటలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం, కరువు వల్ల ఆకలితో అల్లాడిన ప్రజలకు అంబలి కేంద్రాలు పెట్టి, పశుగ్రాసం పంచి అండగా నిలిచిన చరిత్ర సీఐటీయూకు ఉందని అన్నారు.పోరాటాలని తీవ్రతరం చేయడం ద్వారానే కార్మిక వర్గాన్ని సంఘటతం చేయగలరని సిఐటియు సీనియర్ నాయకులు ఆర్. సుధా భాస్కర్ స్పష్టం చేశారు. కులం, మతం, ప్రాంతం పేరిట కార్మికుల్ని విభజించి పోరాటంలోకి రాకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో 40 ఏళ్ల క్రితం ఒక ఫ్యాక్టరీలో మొదలైన సిఐటియు ప్రస్థానం రాష్ట్ర మహాసభలు నిర్వహించే శక్తిగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఎన్పిఆర్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా సంఘాల నాయకులు బి. మల్లేశం, జీ.సాయిలు, కే. రాజయ్య, జయరాజు, మాణిక్యం, మల్లారెడ్డి, గోపాల స్వామి, ఎల్లయ్య, భాస్కర్, బాలమణి, నర్సమ్మ, కే. మహేందర్ రెడ్డి, మల్లేషం, నాగరాజు, సంతోష్, కృష్ణ, పాండురంగారెడ్డి, భాగారెడ్డి, బండ్ల స్వామి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నరేందర్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు.ఈ మహాసభల నిర్వహణ కోసం శనివారం మెదక్ పట్టణంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం నిర్వహించారు ఈ సమావేశంలో ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శిగా ఏ. మల్లేశంలు ఎన్నికయ్యారు.