- పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుండి చక్కని స్పందన చూసి, అదే క్రమంలో జూలై 14న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకున్నట్లు సివిల్ సప్లైస్ కమిషనర్ డి.ఎస్.చౌహన్ తెలిపారు.ఆదివారం సాయత్రం 14న తుంగతుర్తి నియోజక వర్గంలోని తిరుమలగిరి లో నూతన రేషన్ కార్డులను ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము 5,61,343 కొత్త రేషన్ కార్డులకు 27, 83,346 మంది కొత్త సభ్యులను నమోదు చేయడం జరిగిందని, దీనికి గాను ప్రభుత్వానికి సంవత్సరం నకు 1,151 కోట్లు అదనంగా ఖర్చు వస్తుందన్నారు.రేషన్ కార్డు రాలేదని ఎవ్వరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు.ప్రజాపాలనలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు.జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ నందా మాట్లాడుతూ.. జిల్లాలో 3,24,165 రేషన్ కార్డులు ఉండగా కొత్తగా 23,870 కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు.తుంగతుర్తి నియోజకవర్గంలో61,715 కార్డులు ఉండగా కొత్తగా 4230 రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు.పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ మహా యజ్ఞానికి ప్రజలు నీరాజనం పలుకుతున్నట్లు తెలియజేసారు.బయోమెట్రిక్ విధానం ద్వారా పారదర్శకంగా అమలు పరుస్తామన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ నర్సింహా, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
