- బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో వెనకడుగు వేయం.
- రెండ్రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా.
- త్వరలో కార్యాచరణ ప్రకటిస్తా.
- ప్రాజెక్టుకు నీటి తరలింపు గురించి కేంద్ర ఆర్థిక శాఖకు ముందే నివేదిక ఇచ్చాం.
- మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆరునూరైనా గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిందని ఇంకా ఏం ప్రయత్నాలు చేయాలో అవి కూడా చేస్తామని వివరించారు. ఈ అంశంపై రెండ్రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా అని చెప్పారు.ఏపీ బనకచర్ల కుట్రపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్న మంత్రి ఈ విషయంలో కేంద్రం తొందరగా తేల్చకపోతే కొట్లాటకైనా సిద్ధమన్నారు. దీనికి సంబంధించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.బనకచర్ల ప్రాజెక్టును తాము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.తమ అభ్యంతరాలు ఏంటో కూడా స్పష్టంగా వివరించినట్లు పేర్కొన్నారు.బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. కాగా బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కేంద్రం ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు పూర్తి వివరాలు అందించనున్నారు. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.ఈ ప్రాజెక్టుతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖ అధికారులు వివరించనున్నారు.ఇదీలావుంటే గత నెలలో జరిగిన భేటీల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని,ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. కాగా పోలవరం-బనకచర్ల రివర్ లింక్ ప్రాజెక్ట్ డీపీఆర్ పై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 2న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్‌తో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఏపీ సర్కార్ రూపొందించిన డీపీఆర్ పై ఏపీ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్, జలవనరులశాఖ సహాలదారు వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్ ఇంజినీర్ నరసింహమూర్తి వివరించారు.ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తోన్న తెలంగాణ ఈ సమావేశంలో నిరసన తెలిపింది. మరోవైపు సముద్రంలోకి వెళ్లే జలాలు మాత్రమే వినియోగించుకుని జనకచర్ల రూపొందించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.ఇందులో తెలంగాణకు అభ్యంతరమేంటని ఏపీ సీఎం చంద్రబాబు సైతం ప్రశ్నించారు.