Take a fresh look at your lifestyle.

ఎన్నికలప్పుడే రాజకీయాలు

  • రాష్ట్ర ప్రగతి కోసం మోడీని ఎన్ని సార్లైనా కలుస్తా.
  • రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తా.
  • ఎన్నికలప్పుడే రాజకీయం.. అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుపోతా.
  • సామాజిక న్యాయం, సమాన అవకాశాలే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
  • తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించను.
  • హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేంత వరకు నిద్రపోను.
  • జహీరాబాద్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి.
  • సంగారెడ్డి జిల్లాలో రూ. 494.67 కోట్ల పనులకు సీఎం శంకుస్ధాపన.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రానికి రావలసిన కేంద్ర నిధుల విషయంలో ప్రధానమంత్రి మోడీని ఎన్ని సార్లయినా కలుస్తానని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్న ఆయన తర్వాత అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని పోతామన్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తున్నామన్నట్లు వివరించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలతో తెలంగాణను ప్రపంచంలోనే ఒక గొప్ప ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ఒక అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్రపోనని వ్యాఖ్యానించారు. అందుకు అండగా నిలబడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. జహీరాబాద్‌ నిమ్జ్ కోసం భూ సేకరణలో భాగంగా భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఆదేశాలిచ్చారు. గత పదేళ్ల కాలంలో జహీరాబాద్ నిమ్జ్ పూర్తిగా కుంటుపడిందని చెబుతూ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచి భూ సేకరణను వేగవంతం చేశామన్నారు. హ్యూందయ్ సంస్థ త్వరలోనే ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించనుందని సీఎం తెలిపారు. రైతులందరూ కలిసి సహకార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నడిపిస్తామంటే చెక్కర కర్మాగారం ఏర్పాటుకు నిమ్జ్‌లో వంద ఎకరాలు కేటాయించి అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

  • ‘ఇందిరా’ స్పూర్తితో పాలన.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తోందని సీఎం చెప్పారు. రైతు, మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. రుణ విముక్తులను చేయడానికి రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సహాయం కింద రైతు భరోసాను రూ.10 వేల నుంచి రూ. 2 వేలకు పెంపు, మద్దతు ధరతో పాటు ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లింపు, భూమిలేని వ్యవసాయ నిరుపేదలకు రూ. 12 వేల చొప్పున సహాయం అందిస్తున్న విషయాలను సీఎం వివరించారు.మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందించడంతో పాటు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించారు. వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిర్ధేశించుకున్న కార్యక్రమాలను విశదీకరించారు. జహీరాబాద్ పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి.. స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన పెట్రోల్ పంపును ప్రారంభించారు. అక్కడే మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారి ఉత్పత్తులను పరిశీలించారు. సభా వేదికగా సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్యకు బ్యాంకు లింకేజీ కింద రూ. 126.54 కోట్లు, మెప్మా కింద 17.51 కోట్లకు సంబంధించి చెక్కును అందజేశారు. జిల్లాలో రూ. 494.67 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

  • కేసీఆర్ మా ప్రభుత్వానికి సూచనలు, సలహాలివ్వాలి.

తాను జడ్పీటీసీ స్థాయి నుంచి వివిధ పదవులు అలంకరించానని సీఎం ప్రకటించారు. అధికారంలో లేకపోయినా నిత్యం జనంలో ఉండి పనిచేశానని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం అధికారంలో పోగానే ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారని విమర్శించారు. తాను రాజకీయ విమర్శలు చేయదలచుకోలేదన్నారు. కేసీఆర్ తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమించిన 1200 మంది అమరులయ్యారని సీఎం వెల్లడించారు. కానీ గడిచిన పదేండ్లలో కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి తప్ప.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, లక్ష వరకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవే కాకుండా 3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామని, పరిశ్రమల రాకతో ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. నిమ్జ్ లో హుండాయ్ సంస్థకు 450 ఎకరాలు కేటాయించామని, త్వరలోనే సంస్థ కార్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నదాని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జహీరాబాద్ గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీగా మారనున్నదన్నారు.

  • బసవేశ్వరుడి బాటలో కాంగ్రెస్ పాలన.

విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో తెలంగాణ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో భాగంగా బసవేశ్వరుడి సూచనల మేరకే కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని రాహుల్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ కులగణన చేపట్టిందన్నారు.బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచిక భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకుని సామాజిక న్యాయం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి అన్నారు.

  • అన్నదాతకు అండగా ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉన్నదని సీఎం చెప్పారు. రూ.26 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, ఎకరాకు రూ.5 వేలుగా ఉన్న రైతు భరోసాను రూ.6వేలకు పెంచామని, భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే రూ.12 వేలు అందిస్తున్నాం, వరి వేస్తే ఉరే అని గత ప్రభుత్వ పెద్దలు చెబితే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లు పండిస్తున్న రైతులకు రూ.500 బోసన్ ఇస్తుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఆడబిడ్డల కోసం గత 18 నెలల కాలంలో ఉచిత బస్సు ప్రయాణానికి రూ.5500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత ఏడాదిలో స్వయం సహాయక సంఘాలకు రూ.20వేల కోట్ల బ్యాంకు లింకేజీలు ఉంటే ఈ ఏడాది రూ. 21 వేల కోట్ల లింకేజికి పెంచామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రానున్న నాలుగేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టీసీ బస్సులను, పెట్రోల్ బంకులను అమ్మా ఆదర్శ పాఠశాలల నిర్వహణ, నిత్యావసరాల సరుకుల పంపిణీ వంటి వాటిలో మహిళల బాధ్యతలు పెంచి వారిచే నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.

  • నిండుమనుసుతో దీవించండి.

రాష్ట్ర ప్రభుత్వ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్నదని, ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. యువత, నిరుద్యోగులకు సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఎప్పుడూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎవరు ఏమనుకున్నా సోనియాగాంధీ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకుని ఇతర స్థానాలను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలు తీసుకువచ్చి, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని, వన్ ట్రిలియన్ ఎకనామీ రాష్ట్రంగా , తెలంగాణ ను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. టోక్యో, న్యూయార్క్ సిటీలకు సరసనా భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ కానున్నదని అంతవరకు నిద్రపోనున్నారు. ఇదెలా ఉండగా జహీరాబాద్ చెక్కల పరిశ్రమ ఏర్పాటు కోసం నిమ్జ్ లో 100 ఎకరాల కేటాయిస్తామని, నిధులు కూడా అందిస్తామని, సింగూరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సంజీవరెడ్డి, నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.