Take a fresh look at your lifestyle.

అర్హత లేని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది మారపాక వెంకన్న.

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: పేషెంట్లను ఆర్థికంగా దోపిడీ చేస్తూ అనారోగ్యం పాలు చేసే విధంగా వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రాణాలు హరిస్తున్న అర్హత లేని డాక్టర్లపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఏఐ ఎల్ యు) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ న్యాయవాది మారపాక వెంకన్న శనివారం ఒక ప్రకటనలో కోరారు. వైద్యం అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఒక ప్రాథమిక హక్కు అని, వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు చట్టం జోక్యం చేసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. ముఖ్యంగా వైద్యం అనేది తిరిగి తీసుకురాలేని ప్రాణానికి సంబంధించిన విషయమని, అలాంటి విలువైన ప్రాణాలు అర్హత లేని డాక్టర్ల చేతిలో గాలిలో కలుస్తుంటే సంబంధిత శాఖ అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం అధికారులు అర్హత లేని డాక్టర్లపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలని, అలా చేయకుండా విధులలో నిర్లక్ష్యం వహిస్తూ అర్హత లేని డాక్టర్లు, ప్రైవేటు ఆసుపత్రులతో లాలూచి పడుతున్నారన్న ఆరోపణలున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు వేసి కేసులు నమోదు చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సక్రమంగా తమ విధులు చట్ట ప్రకారం నిర్వహిస్తే అర్హత లేని డాక్టర్ల ఆట కట్టించడం పెద్ద విషయం కాదు అన్నారు. విధులను సక్రమంగా నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శించే వారిపై కూడా మాండమస్ రిట్ ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రష్యా, చైనా దేశాలలో వైద్య విద్యను అభ్యసించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అర్హత, రిజిస్ట్రేషన్ లేకుండా ఎలా ప్రైవేట్ ఆస్పత్రులను ఏర్పాటు చేసి నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. అన్ క్వాలిఫైడ్ డాక్టర్ల విషయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్ని సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్హత లేని డాక్టర్లు, రేడియాలజిస్టులు ప్రజలనుండి అర్హత లేకుండా చికిత్స చేసి దోపిడీ చేసిన సొమ్మును, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హత లేని డాక్టర్ల విషయంలో తక్షణ చర్య కోసం ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా అత్యవసర చికిత్స కోసం రాత్రిపూట ఒక డ్యూటీ డాక్టర్ ఉండేలా ఉన్న నిబంధనల ప్రకారం తప్పకుండా రాత్రి వేళల్లో కూడా ప్రైవేట్ ఆస్పత్రులను తెరిచి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హత లేని డాక్టర్లను గుర్తించి సంబంధిత మిగతా ఆసుపత్రులను కూడా సీజ్ చేయడంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని సీనియర్ న్యాయవాది మారపాక వెంకన్న విజ్ఞప్తి చేశారు

Leave A Reply

Your email address will not be published.