Take a fresh look at your lifestyle.

పుష్కర పనుల్లో నాణ్యత పాటించాలి

  • సీఎం, గవర్నర్, మంత్రులు సహ వీఐపీలు పాల్గొంటారు.
  • నదిలో 50 మంది గజఈతగాళ్ళను సిద్ధంగా ఉంటాలి.
  • శానిటేషన్ ఇబ్బంది తలెత్తకుండా చూడాలి.
  • 24 గంటలు విద్యుత్ సరఫరా కొనసాగాలి.
  • రవాణా, ట్రాఫిక్ ప్లాన్ పక్కాగా ఉండాలి.
  • సరస్వతి పుష్కర పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం పుణ్యక్షేత్రం త్రివేణీ సంఘంలోని అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలకు సిద్ధమవుతోంది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ముందుగా 14వ తేదీ రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిధున రాశిలో ప్రవేశంతో అంతర్వాహిని అయిన సరస్వతి పుష్కరాలు ఆరంభం కానున్నాయి. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కరాల పుణ్యస్నానాలు ఆచరించాల్సివుంది. ఈ క్రమంలో పుష్కర పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యత పాటించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం కాళేశ్వరంలో వీఐపీ ఘాట్, సరస్వతి మాతా విగ్రహం, జ్ఞానతీర్థం, నదిలో భక్తుల స్నానమాచరించు ప్రదేశం, టెంట్ సిటీ పనును ఆయన పరిశీలించారు.అనంతరం టెంట్ సిటీలో అన్ని శాఖల అధికారులతో సమీక్షను మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..పుష్కరాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహా వీఐపీలు పాల్గొంటారని ఈ నేపథ్యంలో ఘాట్ పనులతో పాటు బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలను అధికారులకు ఆయన సూచించారు.పనులు జాప్యం చేయరాదని,పట్టణం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు.పుష్కరాళ్ళు జరిగే 12 రోజులు పండుగ వాతావరణంలా ఉండాలన్నారు.సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరణ చేయాలని తెలిపారు.పిండ ప్రధాన భవనం పనులు ఆలస్యపై అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.భక్తులు హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు నదిలోకి స్నానాలకు వెళ్ళడానికి తాత్కాలిక రహదారి ఏర్పాటుతో పాటు క్వియర్ మ్యాట్ ఏర్పాటు చేయాలని తెలిపారు.భక్తులు నదిలోకి వెళ్లకుండా వెళ్లకుండా బారికేడ్స్, ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. నదిలో 50 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు నాటుపడవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పుష్కరాలు సందర్భంగా మొట్టమొదటిసారిగా కాలేశ్వరంలో టెంట్ సిటి ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమాలు సజావుగా, సక్రమంగా పకడ్బందీగా జరిగేందుకు మినిట్ టు మినిట్ కార్యక్రమం తయారు చేయాలని సూచించారు.హారతి కార్యక్రమం పర్యవేక్షణకు దేవాదాయశాఖ నుండి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. పుష్కర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని, ఆ తర్వాత రోజు నుంచి గవర్నర్, రాష్ట్ర మంత్రులు వచ్చే ఆవకాశం ఉన్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.మహదేవ పూర్ నుండి వీధిదీపాలు ఏర్పాటుతో పాటు డివైడర్లు మధ్యలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్‌కు సూచించారు.రహదారులకు మరమ్మత్తులు నిర్వహించాలని ఎక్కడ గుంతలు ఉండొద్దని ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు.తాత్కాలిక బస్టాండ్ వద్ద తాత్కాలిక లైటింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం చాలా ముఖ్యమని పట్టణం మొత్తం పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.మరుగుదొడ్లు పరిశుభ్రత పాటించేందుకు ప్రతి 30 నిమిషాలకు పరిశుభ్రం చేసే విధంగా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. పనులు పర్యవేక్షణకు నియమించిన నోడల్ అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు.పనులలో నాణ్యత పాటించాలని నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని మంత్రి కాంట్రాక్టర్లు ను హెచ్చరించారు.ప్రత్యేక అధికారులు స్థానికంగా ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు.ఒక్క నిమిషం కూడా కరెంటు పోవద్దని కాటారం, బీరసాగర్ నుండి విద్యుత్ సరఫరా తీసుకోవాలని అన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే తదుపరి చర్యలకు ఆరు జనరేటర్ 125 కేవీ జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. దేవాలయం, 100 గదుల సత్రంలో జనరేటర్లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. భక్తులకు ప్రతి రోజు అన్నదానం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. భక్తులు నదిలోకి వెళ్ళు సందర్భంలో ఎండకు కాళ్లు కాలకుండా మ్యాట్స్ ఏర్పాటు చేయాలన్నారు. రవాణా సౌకర్యం కల్పనకు క్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ ప్లాన్ ప్రక్కగా తయారు చేయాలన్నారు.

  • పవిత్ర స్నానాలకు లక్షలాది మంది సిద్ధం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత తొలిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి.గతంలో ఉమ్మడి ఏపీలో 2013లో చివరిసారిగా సరస్వతి నదీ పుష్కరాలు జరిగాయి.ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజులు పాటు జరగనున్న అంతర్వాహిని సరస్వతి నదీ పుష్కరాల సందర్భంగా పవిత్ర స్నానమాచరించేందుకు లక్షలాది మంది భక్తులు సిద్ధమవుతున్నారు.ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు చేస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.నదీ తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు.సరస్వతీ నది ఉత్తరాఘండ్ రాష్ట్రం బద్రీనాథ్ సమీపంలోని ‘మన’ అనే గ్రామంలో పుట్టింది. మన గ్రామంలో కూడా అంతర్వాహిని సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి.ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర చత్తీష్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడ భక్తులు కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు తరలిరానున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలు విజయవంతంగా జరిగేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.