ముద్ర,వీపనగండ్ల: మహాశివరాత్రికి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి గ్రామంలోని కొందరు వ్యక్తులతో పాదయాత్రగా వెళ్లిన యువకుడు వారి వెంట కొంత దూరం వెళ్లి తాను గ్రామానికి వెళ్ళిపోతానంటూ ఇంటికి చేరకుండా అదృశ్యమై 18 రోజుల తర్వాత యువకుడి అస్థిపంజరం బయటపడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై కే రాణి కథన ప్రకారం వీపనగండ్ల గ్రామానికి చెందిన బండారు స్వాములయ్య కుమారుడు బండారు వీరస్వామి (35) ఫిబ్రవరి 23 న శ్రీశైలం పుణ్యక్షేత్రానికి గ్రామంలోని కొందరు వ్యక్తులు పాదయాత్రగా వెళుతుంటే వారి వెంట వెళ్ళినట్లు తెలిపారు.కొంత దూరం వెళ్లిన తర్వాత వీరస్వామి కి నడవడానికి చేతకాకపోవటంతో తిరిగి గ్రామానికి వెళ్లిపోతానని వారితో చెప్పి వెనుదిరిగినట్లు ఎస్ఐ తెలిపారు.శివరాత్రి అయిపోయిన ఇంటికి తిరిగి రాని కొడుకుని గురించి పాదయాత్ర వెళ్లి వచ్చిన వ్యక్తులను తండ్రి స్వాములయ్య ఆరతీయగా అదే రోజు వీరస్వామి తమతో పాటు కొద్ది దూరం వచ్చి ఇంటికి వెళ్లి పోతానని గ్రామానికె వచ్చినట్లు వారు తండ్రికి వివరించినట్లు తెలిపారు.ఆ రోజు నుంచి తల్లిదండ్రులు బంధువులు వీరస్వామి కోసం వెతికిన ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.బుధవారం ఉదయం సంపత్ రావు పల్లి శివారులోని గట్టు వద్ద మనిషి ఆనవాలున్న అస్థిపంజరం,దాని ప్రక్కనే బ్యాగు ఉండటం చూసిన కొందరు రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎస్సై రాణి ఘటనా స్థలం చేరుకుని ఆస్థిపంజరం సమీపంలోనే బ్యాగ్ లో ఆధార్ కార్డు,పాన్ కార్డు, దుస్తులు లభించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు, ఆస్థిపంజరం వీరస్వామి దేనని కుటుంబ సభ్యులు కూడా గుర్తించినట్లు ఎస్సై కె రాణి తెలిపారు.సంఘటన స్థలంలో లభించిన అస్థిపంజరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు వివరించారు.