ముద్ర, తెలంగాణ బ్యూరో :
విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఉప ముఖ్యమంత్రిగా
భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల సమక్షంలో బాధితులకు చెక్కులు అందించారు.

మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేష్, ముఖ్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు రూ.1 కోటి చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ 10 లక్షలకు పెంచామన్నారు. సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకూడదని కుటుంబ బీమా తీసుకొచ్చామన్నారు.
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.