ముద్ర : కాప్రా
కాప్రా చెరువు సుందరీకరణ కోసం హైడ్రా రూ. 35 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏ.వి. రంగనాథన్ ను శుక్రవారం ఎమ్మెల్యే కలిసి కాప్రా చెరువు అభివృద్ధి ప్రణాళిక పై చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాప్రా చెరువు సాధారణ నీటి వనరు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల వేలాది మంది ప్రజలకు జీవనాధారమని పేర్కొన్నారు. మంజూరైన రూ.35 కోట్ల నిధులతో చెరువు పునరుద్ధరణ, భూగర్భ జలాల స్థాయి పెంపు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, పచ్చదనం పెంపు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ చర్య ఉప్పల్ నియోజకవర్గంలో స్థిరమైన పట్టణాభివృద్ధి , పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక ముందడుగుగా నిలుస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. నీటిమడుగుల సంరక్షణ, పునరుద్ధరణకు హైడ్రా అధికారులు చూపుతున్న చొరవకు ప్రతినిధి బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సమావేశంలో కాప్రా డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బైరి నవీన్ గౌడ్ కూడా పాల్గొని, కాప్రా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టు విజయవంతంగా అమలుకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.