Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం.. వైభవంగా జరిగిన శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవం..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా జరిపించారు.
సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించి సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు.
ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఆదివారం సుమారు 5000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.