వ్యాధి గుర్తించడం ఆలస్యమైతే శాశ్వత వైకల్యం
ఎన్ హెచ్ఆర్సి లెప్రసీ స్పెషల్ మానిటర్ ప్రదీప్తా కుమార్ నాయక్
(ముద్ర , ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయగలిగిన వ్యాధి అని.. సమయానికి మెరుగైన ఔషధ చికిత్స (ఎండిటి) అందిస్తే పూర్తిస్థాయిలో నివారణ సాధ్యమని ఎన్ హెచ్ ఆర్ సి లెప్రసీ స్పెషల్ మానిటర్ ప్రదీప్తా కుమార్ నాయక్ అన్నారు.
ఈ వ్యాధి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టి రోగులకు మెరుగైన వైద్యం అందించటమే మన ముందున్న లక్ష్యమన్నారు.
తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రంగారెడ్డి జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో కుష్టు వ్యాధి నియంత్రణ చర్యలు అమలు, వ్యాధి బారిన పడిన వ్యక్తుల మానవ హక్కుల పరిరక్షణ అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఆర్ సి స్పెషల్ లెప్రసి మానిటర్ ప్రదీప్తా కుమార్ నాయక్ మాట్లాడుతూ..
కుష్టు వ్యాధి బారిన పడిన వ్యక్తుల హక్కులు, గౌరవం అలాగే సామాజిక సమానత్వాన్ని రక్షించడం ఎన్‌హెచ్‌ఆర్‌సి యొక్క ముఖ్య బాధ్యతని అన్నారు.
కుష్టు వ్యాధి ఆలస్యంగా గుర్తించబడితే శాశ్వత వికలాంగతకు దారితీయవచ్చని హెచ్చరించారు. ఈ వ్యాధిని కేవలం వైద్య సమస్యగా కాకుండా, అపోహలు, సామాజిక వివక్షతో ముడిపడిన సామాజిక సమస్యగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపు, తొందరగా గుర్తింపు, ఆరోగ్య సేవలకు సులభ ప్రాప్తి, సామాజిక భద్రతా పథకాలు అలాగే విభాగాల మధ్య సమన్వయంతో హక్కుల ఆధారిత సమగ్ర దృక్పథం అవలంబించాలని అన్నారు. అలాగే జిల్లాలో వివిధ శాఖల ద్వారా లెప్రసీ బాధితులకు అందుతున్న వసతులపై హర్షం వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి జిల్లాలో కుష్ఠు నియంత్రణ కార్యక్రమంకు సంబందించిన వివరాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. తరువాత జిల్లా కుష్ఠు వ్యాధి గ్రస్తుల వివరాలు వారికి అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, మానవ హక్కుల ప్రతినిధి, డా. నాయక్, శాఖల వారీగా సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే, కుష్ఠు వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని, కుష్ఠు వ్యాధిగ్రస్థులకు అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా, అందరు అధికారులు మానవత్వంతో పని చేయాలని సూచించారు. కుష్ఠు వ్యాధి కార్యక్రమం జాయింట్ డైరెక్టర్, డా. జాన్ బాబు కుష్ఠు వ్యాధి వ్యాప్తి జరిగే విధానం, లక్షణాలు, చికిత్స, కుష్ఠు వ్యాధి నియంత్రణ లో అందరి పాత్రను పూర్తిగా విశదీకరించారు. చివరగా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. పాపారావు గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, ఇతర శాఖల జిల్లా అధికారులు, జిల్లా ప్రాజెక్ట్ అధికారి, డా. అంబికా, ఇబ్రహీంపట్నం ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. లక్ష్మి ప్రసన్న, జిల్లా పారా మెడికల్ అధికారి, శ్రీమతి సులోచన, డిప్యూటీ పారా మెడికల్ అధికారులు పాల్గొన్నారు
*****