ముద్ర :మల్కాజిగిరి
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి 1 నుంచి 31, వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో మొత్తం 674 మంది బాల కార్మికులను రక్షించినట్లు మల్కాజిగిరి డీసీపీ ఉమెన్ సేఫ్టీ టి. ఉషారాణి తెలిపారు. ఈ సందర్భంగా బాల కార్మికులను నియమించిన యాజమాన్యాలపై 186 కేసులు నమోదు చేసి, 443 జీడీ ఎంట్రీలు చేశారు. మొత్తం 189 మంది యాజమాన్య ప్రతినిధులను అరెస్టు చేశారు.
డివిజన్ వారీగా ఏర్పాటు చేసిన 7 స్మైల్ టీమ్స్, ఏహెచ్‌టీయూ బృందం, ఇతర లైన్ డిపార్ట్మెంట్ల సహకారంతో హానికర పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. రక్షించిన పిల్లలను సంబంధిత బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరు పరచారు.
రక్షించబడిన వారిలో తెలంగాణకు చెందిన వారు 376 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 102 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 189 మంది, నేపాల్‌కు చెందిన వారు 7 మంది ఉన్నారు. బెగంపేట డివిజన్ స్మైల్ టీమ్ ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు.
ఈ కార్యక్రమం డీసీపీ ఉమెన్ సేఫ్టీ టి. ఉషారాణి పర్యవేక్షణలో, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాల కార్మికత్వం నేరమని, సమాచారం ఉంటే 100, 112 లేదా 1098కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.