అధికారులే చూసుకుంటారంటూ దాటవేత
వెంటనే రాధాకిషన్ రావును పిలిచిన సిట్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారిస్తున్న సమయంలో.. అనూహ్యంగా మరో వ్యక్తిని పిలిచారు. విచారణ మొదలుకాగానే.. కేటీఆర్ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. అయితే, అంతకు ముందే కొన్ని కీలక విషయాలు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి రాబట్టిన సిట్.. ఆ ప్రశ్నలు వేసినా కేటీఆర్ ఆన్సర్ ఇవ్వకుండా అంతా అధికారులే చూసుకున్నారంటూ దాట వేసేందుకు ప్రయత్నించారు. దీంతో సిట్ టీం.. వెంటనే రాధాకిషన్ రావును విచారణకు పిలిచింది. రాధాకిషన్ రావు చెప్పిన కొన్ని విషయాలపై వీరిద్దరిని ఎదురెదురుగా కూర్చుండబెట్టి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇలా ఆధారాలు దగ్గర పెట్టి మరీ కేటీఆర్‌ను విచారించారు. సడన్‌గా మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుని రప్పించడంపై అంతా చర్చగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. తొలుత కేటీఆర్ స్టేషన్ లోపలికి వెళ్లగానే కాసేపు కూర్చోబెట్టారు. చేతిలో కొన్ని పేపర్స్ కేటీఆర్ తీసుకెళ్లారు. పావు గంట తర్వాత విచారణ చేస్తున్న గది వద్దకు ఆయన్ని తీసుకెళ్లారు అధికారులు.
జాయింట్ సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరిలతోపాటు ఐదుగురు అధికారులు కలిసి విచారణ చేశారు. రెడీ చేసిన ప్రత్యేక ప్రశ్నలను దగ్గరపెట్టి ఆయన్ని విచారించారు. 2023 ఏడాదిలో బీఆర్ఎస్‌కి భారీగా విరాళాలు ఎలా వచ్చాయి? వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న ఎలక్టోరల్ బాండ్స్ వెనుక ఏం జరిగింది? వ్యాపారవేత్తలు ఎందుకు మీపై ఫిర్యాదు చేశారనే కోణంలో విచారణ చేశారు.
కేటీఆర్- రాధా కిషన్‌రావులను దగ్గర పెట్టి విచారణ
ఈ వ్యవహారం గురించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మీకేం తెలుసు? ఎన్నికలకు ముందు దాదాపు వేలాది ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? ప్రైవేటు ఛానెల్ ఎండీ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌కి డబ్బులు ఎందుకొచ్చాయి? రాజకీయం-ఆర్థికంగా లబ్ది కోసమే ఫోన్ ట్యాప్ చేశారా? గతంలో రాధాకిషన్‌రావు చెప్పిన రికార్డులు, ఛాటింగులకు సంబంధించిన డేటాను దగ్గర పెట్టి విచారణ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు అధికారులు చూసుకున్నారని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల కంటే ముందు చాలా కేసులు సంబంధించిన డైరెక్షన్ కేటీఆర్ నుంచి వచ్చినట్టు సిట్ అధికారుల వద్ద సమాచారం ఉంది. మునుగోడు ఎన్నికల సమయంలో రైడ్స్ చేసి కొన్ని కోట్లు స్వాధీనం చేసుకుంది టాస్క్‌ఫోర్స్. దానిపై కూడా ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.
రాధాకిషన్ రావు.. రండి
పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇవ్వకుండా దాటవేస్తుండటంతో.. దాదాపు గంటన్నర విచారణ తర్వాత సిట్ టీం.. మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు సమాచారం ఇచ్చి పిలిపించారు. ఆయనతో కలిపి కేటీఆర్ ను విచారించారు.