Take a fresh look at your lifestyle.

అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ

 

హెచ్‌ఐవీ బాధితులను వివక్ష లేకుండా ఆదరించాలి-డీఎంహెచ్‌ఓ డా. రవి కుమార్ నాయక్

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారి స్మారకార్థం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే “అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే” కార్యక్రమాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. రవి కుమార్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. రవి కుమార్ నాయక్ మాట్లాడుతూ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పట్ల సమాజంలో ఇంకా అపోహలు, వివక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని తెలిపారు. హెచ్‌ఐవీ బాధితులను చిన్నచూపు చూడకుండా మానవతా దృక్పథంతో ఆదరించాలని, సమాజం వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

అలాగే హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కారణంగా మరణించిన వారిని స్మరించుకోవడం, వారి కుటుంబాలకు మానసిక బలాన్ని అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతులకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో దిశా ప్రోగ్రామ్ మేనేజర్ రమేష్, ఫార్మసీ అధికారి సురేష్ కుమార్, ఎమ్.ఆర్.డి.ఎస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, లింక్ వర్కర్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఏఎన్‌ఎంలు జి.జె. కవిత, సరస్వతి, ఆశా కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.