ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు.
సోమవారం సాయంత్రం జిల్లా ఐడిఓసీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్లు అమరేందర్, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా అనధికార ఇసుక తవ్వకాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టాలని సూచించారు.
జిల్లాలో ఇసుక బుకింగ్ పూర్తిగా “మన ఇసుక వాహనం” యాప్ ద్వారా ఆన్లైన్ విధానంలోనే జరగాలని, ఆఫ్‌లైన్ బుకింగ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని 15 ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక తరలింపు పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే జరుగుతుందని తెలిపారు.
ఇటీవల నెంబర్ ప్లేట్ లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలు గుర్తించిన నేపథ్యంలో, అలాంటి వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు కనిపిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కఠినతరం చేయాలని, రాత్రి వేళల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, అవసరమైతే డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపడతామని వెల్లడించారు.
అక్రమ ఇసుక డంపులను గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చట్టబద్ధంగా నియమిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా నిరంతరంగా కొనసాగించాలని, ప్రజలకు పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ అక్రమ ఇసుక తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెంబర్ ప్లేట్ లేకుండా సంచరించే వాహనాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, రాత్రిపూట ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టే దిశగా పోలీసులు పనిచేస్తారని చెప్పారు.
మైనింగ్, రెవెన్యూ శాఖలతో సమన్వయంతో పోలీస్ శాఖ చర్యలు కొనసాగుతాయని, తాహసిల్దార్లు, పోలీసులతో కలిసి అక్రమ తవ్వకాలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డీఎస్పీలు, ఆర్టీవో, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, తాహసిల్దార్లు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.