- డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డి సస్పెండ్
- ఎస్పీ సుబ్బారాయుడు,జేఈవో గౌతమి, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్‌పై బదిలీ వేటు
- మృతులకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం
- గాయాల పాలైన 33 మందికి రూ.2 లక్షల సాయం
- తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు
- బాధితులకు సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శ
- ఉన్నతస్థాయి సమావేశంలో బాధ్యులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
- ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- మృతులకు పోస్టుమార్టం పూర్తి, అంబులెన్సుల్లో స్వగ్రామాలకు తరలింపు
- బాధితులకు రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స
ముద్ర, తెలంగాణ బ్యూరో : తిరుపతిలో భక్తుల తొక్కిసలాట ఘటనను ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకున్నది. ఈ ఘటనకు బాద్యులను బాద్యుల్ని చేస్తూ స్ధానిక డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరనాథరెడ్డిని సస్పెండ్ చేసింది. అలాగే ఎస్పీ సుబ్బారాయుడు,జేఈవో గౌతమి, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్‌పై బదిలీ వేటు వేసింది. తొక్కిసలాటకు సంబంధించి గురువారం ఉదయమే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు నుంచి ప్రాథమిక నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించారు. వాస్తవాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. కొంత మంది అధికారులు విధుల నిర్లక్ష్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిపిన సీఎం.. ముఖ్యంగా డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా ప్రవర్తించారని మీడియాకు వివరించారు.
మరోవైపు తొక్కిసలాట ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం.. టీటీడీ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగాలు ప్రకటించారు. తీవ్రంగా గాయాలైన ఇద్దరికి రూ.5 లక్షలతో పటు ఆరోగ్యం మెరుగయ్యే వరకు వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. గాయాల పాలైన 33 మందికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం, అందరికీ శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. దర్శనం పూర్తయ్యాక గాయపడిన వారిని వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు గురువారం మద్యాహ్నం తిరుపతికి చేరుకున్న సీఎం చంద్రబాబు ముందుగా ఆయన తొక్కిసలాట బైరాగిపట్టెడ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ క్రమంలోనే అయన టీటీడీ ఈవో, కలెక్టర్), ఎస్పీ అధికారుల పై సీరియస్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏదైన ఒక పని బాధ్యత తీసుకున్న వారు సక్రమంగా నెరవేర్చాలని అన్నారు. ఇక నంచి అయినా.. పద్ధతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. టోకెన్లు జారీ చేసే కౌంటర్ వద్ద 2 వేల మంది మాత్రమే పడితారని అనుకున్నప్పుడు 2,500 మందిని ఎలా లోనికి పంపించారని అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పందించిన అధికారులు భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉందని తెలిపారు. బయటకు వదిలేప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని సీఎంకు వివరణ ఇచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు ‘నో ఎక్స్‌ప్లనేషన్స్’ అంటూ వారిపై సీరియస్ అయ్యారు.
అసలేం జరిగిందంటే..?
శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 8న రాత్రి తిరుపతిలోని రామానాయుడు పాఠశాలలో టీటీడీ వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ చేశారు.టోకెన్లు తీసుకునేందుకు వచ్చిన భక్తులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.వారిలో మరో నలుగురికి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో ఐదుగురు పురుషులు. ఒక మహిళ ఉంది. అస్వస్థతకు గురైన వాళ్లలో 20 మంది రుయా ఆస్పత్రిలో, మరో 9 మంది స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురు డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తి చేసిన అధికారులు మృతదేహాలను అంబులెన్సుల్లో స్వగ్రామానికి పంపించారు. గాయపడిన వారిని స్విమ్స్, రుయా ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.వీరిలో కొంతమంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో మిగతావారు కూడా కోలుకుంటారని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సీఎంకు ఇచ్చిన నివేదికలో తెలిపారు.
క్షతగాత్రులకు పరామర్శ..
తొక్కిసలాట జరిగిన వెంటనే సంఘటనాస్థలానికి వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆ రాష్ట్ర మంత్రులను ఆదేశించారు. వెంటనే రంగంలో దిగిన మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, వంగలపూడి అనిత,కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు హుటాహుటీనా తిరుపతికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదదర్చారు. గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే తొక్కిసలాట ఘటనపై అధికారులు ఉదయమే సీఎం చంద్రబాబుకు సమగ్ర నివేదిక ఇచ్చారు. సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం వైఎస్ జగన్ లు బాధితులను పరామర్శించారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీసీ కెమెరాల ద్వారా అధికారులు తప్పేవరిదనే విషయాన్ని ఆరా తీశారు.
ఘటనకు బాధ్యులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా తొక్కిసలాట ఘటనపై మంత్రులు మాట్లాడుతూ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వివరించారు. అలాగే తిరుపతిలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ మద్యాహ్నం నేరుగా బైరాగిపట్టెడలోని పద్మావతి పార్క్‌కు చేరుకున్నారు. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్ కల్యాణ్ కు వివరించారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చిందని పవన్ అధికారులపై మండిపడ్డారు. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్క్‌కు వచ్చారని అధికారులు వివరించారు. అక్కడి నుంచి పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆస్పత్రికి వెళ్లిన పవన్ కల్యాణ్ తోపులాట ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులకు పరామర్శించారు.
సీఎంకు తిరుపతి కలెక్టర్ నివేదిక
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సీఎంకు నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం కారణంగా ఒక్కసారిగా భక్తులు వచ్చి తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా కూడా డీఎస్పీ సరిగా స్పందించలేదని, వెంటనే ఎస్పీ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి భక్తులకు సాయం చేశారని రిపోర్టులో తెలిపారు. అంబులెన్స్ వాహనాన్ని టోకెన్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు అతడు అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు, ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్ ఈ నివేదిక అందించారు. ఈ ఘటనపై టీటీడీ ఈవో సైతం స్పందించారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని టీటీడీ ఈవో చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు.
పునరావృత్తం కానివ్వం : సీఎం చంద్రబాబు
తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించాను. దివ్యక్షేత్రం పవిత్రత కాపాడేందుకు ప్రయత్నిస్తాను. ఇలాంటి ఘటనలు పునరావృత్తంకాకుండా చర్యలు తీసుకుంటా. సీఎం నేను తీసుకున్న నిర్ణయాలతో పాటు అధికారులకు కీలక సూచనలు చేశా. వాటిని టీటీడీ బోర్డులో చర్చించి అమలు చేస్తారు. మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తే మంచిది కాదు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు వీలులేదు. తిరుపతిలో దేవుడికి సేవ చేస్తున్నామనే భావనతోనే పని చేయాలి. తిరుపతిలో టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం. తిరుమలలో క్యూలైన్లలో ఉంటే భక్తులు దైవ చింతనలోనే ఉంటారు. వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు పెంచారు, ఎందుకు పెంచారో తెలియదు. ఉన్న సంప్రదాయాలు మార్చడం మంచిది కాదు.ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి.
కుట్రకోణం ఉంది : టీటీడి బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు
తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానాలున్నాయి. ఈ కుట్ర కోణంలో నిజాలు బయటికి వస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదు. కావాలనే కొంతమంది అరుపులు సృష్టించి తొక్కిసలాటకు కారణం అయ్యారని తెలుస్తోంది. అందరి కంటే ముందే వైఎస్సార్పీపీ సోషల్ మీడియాలోకి వీడియోలు రావడం అనుమానాలకు తావిస్తోంది.శవ రాజకీయాలు చేయడం వైఎస్సార్పీపీకి ముందు నుంచి ఉన్న విద్య. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తుంది. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మవద్దు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. 9 ప్రాంతాల్లో 90 కేంద్రాలను ఏర్పాటు చేశాం.
తిరుపతి ఘటన కలిచివేసింది : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
తిరుపతి తొక్కిసలాట ఘనటపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతిచెందినవారికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కలచివేసింది : సీఎం రేవంత్
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదిక స్పందించారు. తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించారనే వార్త తనను తీవ్రంగా కలచివేసింది అన్నారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
భక్తులు ప్రాణాలు కోల్పోవడం దిగ్ర్భాంతి కలిగించింది : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ వద్ద తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న. తొక్కిసలాట ఘటనపై ఏపీ మంత్రులకు ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశా. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని ఆదేశించాను.
మెరుగైన వైద్యం అందించండి : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
తొక్కిసలాట ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇందులో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్న
బాధ్యుతలపై క్రిమినల్ కేసులు పెట్టాలి: మాజీ మంత్రి రోజ
తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్సీపీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై మాజీ మంత్రి రోజ మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాటకు కారణమైన బాధ్యుతలపై క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలన్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడని ప్రశ్నించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తిరుమల ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదనీ అవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలన్నారు. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఆరుగురు చనిపోయారని విమర్శించారు. తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామన్న మంత్రి చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందన్నారు. లడ్డూ ఘటనపై రాద్ధాంతం సృష్టించిన వారు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆరుగురు చనిపోతే చీమకుట్టినట్లయినా లేదా? అని నిలదీశారు.
తొక్కిసలాట ఘటనలో డీస్పీని బకరా చేస్తున్నారు: సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారు. బకరాను వదిలిపెద్ద పులులను పట్టుకోండి.ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలి. ప్రధాని మోడీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారు. 10 లక్షల మంది భక్తుల ప్రాణాలకు విలువ లేదా?.. సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి.
టీటీడీ, పోలీసుల వైఫల్యంతోనే తొక్కిసలాట: సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
టీటీడీ, పోలీసుల వైఫల్యంతోనే తొక్కిసలాట ఘటన జరిగింది. ఘటనపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి.సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నా సామాన్య భక్తుల పరిస్థితి ఏమైందో ఈ ఘటనతో అర్ధమైంది. అక్కడి అధికారులు వీఐపీలకు మాత్రమే పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. ఘటన ప్రాంతంలో చాలా విశాలంగా ఉంది. పోలీసులు లేకుంటే ఘటన జరిగేది కాదు. ఎవరికి వారు క్యూలో వెళ్లి టోకెన్లు తీసుకునేవారు. భక్తులను కట్టడి చేసి ఒక్కసారిగా వదలడంతోనే ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి.
ప్రమాదమా.. కుట్ర కోణామా: ఏపీ హోం శాఖ మంత్రి అనిత
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ప్రమాదమా, కుట్ర కోణామా అనే విషయం విచారణలో తేలుతుంది.బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటాం.ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జగకుండా చూస్తాం.