ముద్ర.వీపనగండ్ల :- మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామ సమీపంలో ప్రకృతి సిద్ధంగా వెలిసిన కొండగట్టులో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు ఈనెల 13,14, న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా ఈ ఉత్సవాలు జరగటం విశేషం. గుట్టలలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించడంతో నిర్వాహకులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు మండల ప్రజలే కాక పానగల్, పెంట్లవెల్లి, చిన్నంబావి, శ్రీరంగాపురం మండలాల ప్రజలతోపాటు వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల చెందిన భక్తులతో పాటు రాయలసీమ ప్రాంతంలో ఉన్న భక్తులు కూడా ఉత్సవాలలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. గ్రామం నుంచి ఆలయానికి చేరుకోవటానికి గతంలో సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజా ప్రతినిధుల చొరవతో నాలుగు కోట్ల రూపాయలతో సంగినేనిపల్లి ఆర్ అండ్ బి రోడ్డు నుండి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మీదుగా వల్లభాపూర్ రోడ్డు వరకు ప్రస్తుతం బీటీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు. దీనితో ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాహనాలపై ఆలయానికి చేరుకోవచ్చు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామపంచాయతీ సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేశారు.సంగినేనిపల్లి గ్రామానికి చెందిన తెలుగు ముదిరాజ్ లు సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయనున్నారు.