Take a fresh look at your lifestyle.

నాటి బీఆర్ఎస్ కోట.. నేడు కాంగ్రెస్ విశ్వాస కోట

మున్సిపాల్ ఎన్నికల్లో అడ్లూరి సంచలనం

15 స్థానాలకు 15 గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు

రాష్ర్ట రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా మంత్రి అడ్లూరి

అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా..

ముద్ర, ధర్మపురి:

రాష్ర్ట కాంగ్రెస్ తో పాటు జాతీయ కాంగ్రెస్ పార్టీలో రాష్ర్ట సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి మొదలుకొని రాజకీయ విశ్లేషకుల వరకు అందరూ శేభాష్ అడ్లూరి అంటున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అడ్లూరి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి మున్సిపాలిటీలోని 15 వార్డులకు గాను 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించడమే ఇందుకు కారణం.

ప్రజల విశ్వాసానికి పట్టాభిషేకం..
మున్సిపాల్ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలకు మంత్రి అడ్లూరి స్పష్టమైన సందేశం ఇచ్చారు. “ఇది గెలుపు అంటే గెలుపు మాత్రమే కాదు.. ప్రజల విశ్వాసానికి పట్టాభిషేకం”. ధర్మపురి రాజకీయ చరిత్రలో ఇది ఒక అపూర్వ ఘట్టంగా చెప్పుకోవచ్చు.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన 15 వార్డులకు 15 వార్డుల సంపూర్ణ విజయం కేవలం ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదు ఇది ప్రజల మనసుల్లో కాంగ్రెస్ పాలనకు లభించిన సంపూర్ణ మద్దతు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోస్గి మున్సిపాలిటిలో మాత్రమే 16 వార్డులకు 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, ధర్మపురిలో సైతం ఏకపక్ష తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

బీఆర్ఎస్ కోటకు బీటలు..

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉండేది. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఎవ్వరూ ఉహించలేదు. ఒకవైపు అధికారం మరోవైపు ధనబలంతో పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ వరుస విజయాలకు బ్రేక్ వేయడం సాధ్యం కాని పనిగా భావించారు. కాని 2023లో ధర్మపురి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనపై ప్రజలు ఉంచిన బాధ్యతను ఏనాడు మరిచిపోకుండా ముందుకు సాగుతున్నారు. ఓడినా.. గెలిచినా.. ప్రజల మధ్య ఉంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన మంత్రి అడ్లూరికి పంచాయతీ ఎన్నికల్లో సైతం నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. నియోజకవర్గంలో మొత్తం 149 గ్రామ పంచాయతీలు ఉండగా 108 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. మున్సిపాల్ ఎన్నికల్లో 15 వార్డులకు 15 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిచించుకొని అడ్లూరి నేడు ధర్మపురి కాంగ్రెస్‌కు విశ్వాసకోటగా మార్చారు. మంత్రిగా తనకు హోదా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఒక సామాన్యుడిగా ముందుకు సాగుతున్నాడు.

రాబోయే తరాలకు ఒక పాఠం..

వరుస విజయాలతో ప్రబల శక్తిగా నిలిచిన మంత్రి అడ్లూరి నాయకత్వ పటిమ భవిష్యత్ నాయకులకు ఒక పాఠం. లక్ష్మణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం ఒక ప్రేరణాత్మక ప్రయాణం. ఎన్.ఎస్.యూ.ఐలో విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, జెడ్పీటీసీగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా అడ్లూరి చేసిన సేవలు ఆయనను మరింత ముందుకు నడిపించాయి. తాను ఎమ్మెల్యే కావాలనే కలను సాకారం చేసుకునేందుకు పట్టు వీడని విక్రమార్కుడిలా ప్రయత్నం సాగిస్తూ వచ్చారు. నిరంతర పోరాటంలో ఓటములు చవిచూసినా, ఎన్నో అవమానాలు, కష్టాలు భరిస్తూ ఏనాడు నిరాశ చెందలేదకుండా విజయం వరిస్తుందనే విశ్వాసంతో తన పోరాటాన్ని కొనసాగించారు. చివరకి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సులతో లక్ష్మీనర్సింహ స్వామి కటాక్షంతో ధర్మపురి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు. కొత్త ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా నియమించబడ్డారు. క్యాబినెట్ విస్తరణలో భాగంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా..

ధర్మపురి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ రెండు కళ్లగా భావిస్తూ ముందుకు సాగుతున్న మంత్రి అడ్లూరి నియోజకవర్గంలో అర్హులైన వారికి తన శాఖ ద్వారా ప్రభుత్వ ఫలాలను అందించడంతో పాటు నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. సీ ఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు అద్దం పట్టినట్లుగా మంత్రి నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నారు. ఆరు నెలల్లో సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం, కొత్త బస్సు డిపో, డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కేంద్రం వంటి ప్రాజెక్టులు అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. 2027లో రాబోయే పుష్కరాల కోసం ధర్మపురిని అందంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి భారీ నిధులు తీసుకువస్తామని చెప్పారు. ఇలా అభివృద్ధి, సంక్షేమం రెండు కలిపి మంత్రి అడ్లూరి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.