Take a fresh look at your lifestyle.

బాన్సువాడలో సాగునీటి జలసిరిప్రారంభానికి సిద్ధమైన మూడు ఎత్తిపోతల పథకాలు వచ్చే ఖరీఫ్ నాటికి 8 వేల ఎకరాలకు నీరు.. వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

ముద్ర, నిజామాబాద్:
బాన్సువాడ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తి దశకు చేరుకున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. త్వరలోనే వీటిని ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

రూ. 106 కోట్ల వ్యయం.. మూడు మండలాలకు లబ్ధి
సుమారు రూ. 106.04 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ పథకాల ద్వారా నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మొస్రా మండలాలకు సాగునీరు అందనుంది. దీనివల్ల దాదాపు 7,975 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు పూర్తిస్థాయిలో నీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ట్రయల్ రన్ పూర్తి.. పంపిణీకి సర్వం సిద్ధం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి ఈ ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించనున్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతికతతో కూడిన పంప్ హౌస్‌లను నిర్మించామని, వీటికి 2.93 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన వివరించారు. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించామని, నీటి పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.

భూగర్భ జలాల పెంపు – పంటల భద్రత
ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా కేవలం సాగునీరు అందించడమే కాకుండా, స్థానిక చెరువులు, కుంటలను నింపడం ద్వారా భూగర్భ జల మట్టం పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. “ఈ ప్రాజెక్టులతో ధాన్యం దిగుబడి పెరగడంతో పాటు పంటలకు పూర్తిస్థాయి భద్రత లభిస్తుంది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సాగునీటి విస్తరణలో ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోంది” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Leave A Reply

Your email address will not be published.